సూర్యాపేట, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీతోపాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు జతకట్టారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేట జనరల్ స్థానంలో దళిత మహిళ అయిన పెరుమాళ్ల అన్నపూర్ణకు చైర్పర్సన్ పదవికి అవకాశం కల్పించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పుట్ట కిశోర్‌ను వైస్ చైర్మన్‌గా అందరి మద్దతుతో ఎంపిక చేసి సీట్లో కూర్చోబెట్టారు.
బీజేపీ, కాంగ్రెస్ చైర్పర్సన్, వైస్ చైర్మన్‌ను దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా మళ్లీ చైర్మన్ పదవిని దళితులు, వైస్ చైర్మన్‌ను తెలంగాణ ఉద్యమకారులకు అవకాశం కల్పిస్తారా లేక మరెవరికైనా ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. జనవరి 26, 2024 నాటికి చైర్పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు కౌన్సిల్ పదవి కాలం నాలుగు సంవత్సరాలు పూర్తయ్యింది. జనవరి 2025 నాటికి వీరి పదవీ కాలం ఉన్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి ఇతర పార్టీలు తోడై మద్దతు ఇచ్చి మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలకు చెందిన చైర్మన్లు, ఎంపీపీలపై అవిశ్వాసం పెట్టి దింపేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం సూర్యాపేట మున్సిపాలిటీకి చేరుకుంది.
కాంగ్రెస్, బీజేపీతోపాటు బీఆర్ఎస్కు చెందిన పలువురిని జంట కలుపుకొని చైర్మన్, వైస్ చైర్మన్‌ను దింపేందుకు అవిశ్వాసం కోసం బుధవారం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన 32 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసిన లేఖతో పాటు నోటీసును జిల్లా కలెక్టర్‌కు అందించారు. అవిశ్వాసం సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై చర్చించేందుకు గురువారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపులు సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరి అవిశ్వాసం పెట్టి నెగ్గేందుకు సరిపడా బలం ఉన్నట్లు కలెక్టర్‌కు ఇచ్చిన లేఖ తెలియజేస్తుండగా ఆ రెండు పదవులకు ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాల్సి ఉంది.