సూర్యాపేట, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలు జరిగి నెల రోజులు కూడా అవకముందే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూండాలు దాడులకు పాల్పడడం దుర్మార్గమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆదర్శ రైతు, కేసీఆర్ వీరాభిమాని అయిన మెండె సురేశ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేశ్‌ను మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి జగదీశ్‌రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఇరువురు నేతలు ధైర్యం చెప్పారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జగదీశ్‌రెడ్డి ఘర్షణలు తెలంగాణ సమాజానికి మంచిది కాదన్నారు. రాజకీయ తగాదాలతో గ్రామాలు వల్లకాడులైన గత చరిత్ర నల్లగొండ జిల్లాది అని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాజకీయ ఘర్షణలకు తావు లేకుండా చేశామన్నారు. ఉమ్మడి జిల్లాలో రాజకీయ దాడులను ఆపాల్సిన బాధ్యత జిల్లా మంత్రులది, పోలీసు అధికారులదేనని చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇలాంటి చిల్లరవాటికి ఆవేశానికి లోనుకావద్దని కోరారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీలు జీడి భిక్షం, దావుల విరప్రసాద్, బీఆర్ఎస్ నాయకుడు మారిపెద్ది శ్రీనివాస్ ఉన్నారు.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్థానిక సంస్థలకు కనీస గౌరవం ఇవ్వలేదని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో చేపడుతున్న కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పిస్తామని చెప్పి, ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడమే దానికి నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామన్నారని, కానీ నేడు వాటికి గౌరవం ఇవ్వడం లేదని తెలిపారు. మరోవైపు ప్రజాపాలన సభల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలయ్యేలా, స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.