సూర్యాపేట రూరల్, జూన్ 17 : త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా సోమవారం సూర్యాపేటలోని జనగాం క్రాస్‌రోడ్డు బాషానాయక్ తండా వద్ద ఈద్గాలో నిర్వహించిన ముస్లింల సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధితోపాటు ఇతరులకు సాయం చేయడంలో భాగస్వాములు కావాలన్నారు.
రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్‌తోనే పండుగలకు గుర్తింపు లభించిందని, దీనిని ఇలాగే కొనసాగించాలని కోరారు. అన్ని పండుగలను ప్రభుత్వం గౌరవిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మంచి వాతావరణం ఏర్పడుతుందని, తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఎప్పుడూ ఆదర్శంగా ఉండే విధంగా ప్రభుత్వం పని చేయాలని అన్నారు. గత పదేండ్లలో శాంతి సామరస్యాలను పెంపొందించి, అన్ని రంగాలను కేసీఆర్ అభివృద్ధి చేశారని చెప్పారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడీడ్పీటీసీ జీడి భిక్షం, ఎస్కే రఫీ, జలీల్, సయ్యద్ సలీం, జానీ తదితరులు పాల్గొన్నారు.