భువనగిరి కలెక్టరేట్/భువనగిరి అర్బన్, మే 11 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయదుందుభి మోగించడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌తో కలిసి భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువు కట్ట సమీపం నుంచి ఏకే ఫంక్షన్ హాల్ వరకు శనివారం బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారి గులాబీ శ్రేణులతో నిండిపోయింది.
అనంతరం విలేకరుల సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కూడా కొనసాగించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పల్లె, పట్నం అనే తేడా లేకుండా విద్యుత్ కోతలు ఉన్నాయని, మంచినీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పనికిరాడన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బలమైన నాయకుడైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కోల్పోయిన దానిని తిరిగి దక్కించుకునేందుకు ప్రజలు తాపత్రయపడుతున్నారని తెలిపారు.
ఆరోపణలు, అసత్యాలు తప్ప కేసీఆర్‌పై చిన్న మచ్చ కూడా లేదని తేలిపోయిందన్నారు. మోదీ మాటల్లో ఓటమి భయం కనిపిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 16 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నదని, భువనగిరి, నల్లగొండ స్థానాల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, నాయకులు జడల అమరేందర్, కొలుపుల అమరేందర్, ఎన్నబోయిన ఆంజనేయులు, కిరణ్‌కుమార్, పాండు, శ్రీనివాస్‌రెడ్డి, ఓంప్రకాశ్‌గౌడ్, వీరేశ్, శ్రీనివాస్, సూరజ్ పాల్గొన్నారు.