సూర్యాపేటటౌన్, జూన్ 29 : ‘మీడియా పేరుతో దాడి చేస్తే ఖబడ్దార్. కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. మీడియా ముసుగులో కొందరు స్లాటర్ హౌజ్‌లు నడుపుతున్నారు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌పై మీడియా ముసుగులో ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు.
ఆదివారం ఆయన సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయలో ఘాటుగా స్పందించారు. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాలను హననం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మీ దాడులకు మేం ప్రతి దాడులు చేస్తే తట్టుకోలేరన్నారు. సంవత్సరమున్నర కాలంగా మీడియాను అడ్డం పెట్టుకుని కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టే వారిని ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిని చూసి మురుస్తున్న వారిని భవిష్యత్‌లో ఎవరూ కాపాడలేరన్నారు.
పథకం ప్రకారమే బీఆర్ఎస్పై దుర్మార్గానికి పాల్పడుతున్నారన్నారు. తెలంగాణాను ఆంధ్ర నుంచి విడదీశారనే అక్కసుతోనే కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నారన్నారు. పోలీసులు తమ పిటిషన్లను పట్టించుకోవడంలేదన్నారు. మాపైనే తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ఇక ప్రజా కోర్టులో శత్రువులకు శిక్షలు తప్పవన్నారు. ‘రాజకీయ పార్టీలుగా మేం తేల్చుకుంటాం. మీడియా అసత్య ప్రచారాలెందుకు. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌పై ప్రేలాపనలు తగదు.
ఉద్యమం నుంచి వచ్చినోళ్లం. కేసులకు భయపడం. మహాన్యూస్‌పై దాడి చేశారని ముసలి కన్నీరు కారుస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌పై అక్కసుతోనే అదే పనిగా దాడులు చేస్తున్నారు’ అని అన్నారు. నిజంగా దాడులు చేయాలనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చొరన్నారు. వారి చేతిలోని ఆయుధాలకు పని చెబుతారన్నారు. ‘నిన్న జరిగింది దాడి కాదు. నిరసన మాత్రమే. మేము దాడులు మొదలు పెట్టాలని కోరుకోవదు. మా సహనానికి పరీక్ష పెట్టొద్దు. మీడియా ముసుగులో మీ ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడితే ఎవరూ ఊరుకోరు. ఎక్కడ దాక్కున్నా.. బిన్ లాడెన్ మాదిరిగా పట్టుకొని మీ పని చెబుతాం’ అని హెచ్చరించారు. ‘మా దాడి వేరేలా ఉంటది.
కేసీఆర్‌ది మొదటి నుంచి క్షమాగుణం. ఆయన క్షమించినా మేం క్షమించబోం. బేషరతుగా మహాన్యూస్ యాజమాన్యం కేసీఆర్, కేటీఆర్‌లకు క్షమాపణ చెప్పాలి’ అని డిమండ్ చేశారు. సాగునీటి విషయంలో సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరూ అజ్ఞానులే అన్నారు. మం త్రులకు పాలన చేతకాక ప్రతి రోజు కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. సూర్యాపేట జిల్లా లో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని, వేసిన విత్తనాలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లులు ఉన్నారు.