మిర్యాలగూడ, ఫిబ్రవరి 10 : కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పజెప్పడం వారి చేతగాని తనానికి నిదర్శనమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వస్తుండు అనగానే కాంగ్రెసోళ్ల లాగులు తడుస్తున్నాయని, ఆ అక్కసుతోనే రేవంత్‌రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మిర్యాలగూడ పట్టణంలోని టీఎన్ఆర్ గార్డెన్స్‌లో సోమవారం మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి పునాది, పట్టుగొమ్మలన్నారు.
9 ఏండ్లు అయినా నదీ జలాల పంపిణీ చేసే తీరిక కేంద్రానికి లేకుండా పోయిందని, అలాంటి కేంద్రం పరిధిలోని కేఆర్ఎంబీ సాగర్ ప్రాజెక్టు నుంచి మనకు మంచి నీరు కావాలంటే తొందరగా ఇస్తదా అని ఆలోచన చేయాలన్నారు. ప్రాజెక్టును కేఆర్ఎంబీకి ఇవ్వడం అంటే ఆంధ్రాకు అప్పనంగా నీటిని రాసివ్వడమేనని తెలిపారు. అప్పట్లో చంద్రబాబు సాగర్ డ్యామ్‌పై హుషారు చేస్తే కేసీఆర్ ఆంధ్రా నాయకులు, పోలీసులను తరిమికొట్టారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో వరుసగా 18 పంటలకు సాగునీరు ఇచ్చి అన్నదాతలకు అండగా నిలిచిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్సోళ్ల చేతిగాని తనం వల్ల సాగర్ డ్యామ్ మన చేతుల్లో నుంచి వెళ్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఆపుతా అని మంత్రి కోమటిరెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని, యాదాద్రి ప్రాజెక్టు పనులను ఆపితే ఆయనను ప్రజలే చెప్పులతో కొడుతారని హెచ్చరించారు. కాంగ్రెసోళ్లకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే సాగర్ ప్రాజెక్టును మన పరిధిలోకి తీసుకురావాలని సవాల్ విసిరారు.
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ శ్రీరామరక్ష అని తెలిపారు. సాగర్ నీళ్ల కోసం కేసీఆర్ పోరాటం మొదలుపెట్టనున్నారని, కాంగ్రెసోళ్లను ఉరికించి కొడుతామని అన్నారు. మన కండ్ల ముందే సాగర్ నీళ్లు పోతుంటే రైతుల కడుపు రగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసోళ్ల నిర్వాకం వల్ల ఎడమ కాల్వ రైతాంగం మళ్లీ తిరోగమనం అయ్యేలా పరిస్థితి వచ్చిందని, సాగర్ డ్యామ్ కేంద్ర బలగాల చేతుల్లోకి పోయిందని చెప్పారు. ఇక యుద్ధం మొదలు పెట్టాల్సిందేనని, కాంగ్రెసోళ్లను తరిమికొట్టాల్సిందేనని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
కాంగ్రెస్ గెలిచింది ధర్మపోరాటం వల్ల కాదు : మాజీ మంత్రి వేముల
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది కేసీఆరేనని, తొమ్మిదిన్నరేండ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను అందించి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించడం వల్ల పార్టీ సంస్థాగత నిర్మాణంపై కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలను ప్రచారం చేసిందని, ప్రజలు
ఒకసారి అధికారం ఇద్దామని గెలిపించారు తప్ప ఆ పార్టీ ధర్మపోరాటం వల్ల కాదని చెప్పారు.
అయినా కాంగ్రెస్ పార్టీ 1.8 శాతం స్వల్ప ఓట్ల తేడాతోనే గెలిచిందన్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం కోసం ప్రగతి భవన్ నిర్మిస్తే, ఇంటి లోపల బంగారంతో నిర్మించారని కాంగ్రెసోళ్లు ఆరోపించారని, ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందులోనే ఉన్నారని బంగారంతో నిర్మించారా అని భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని అన్నారు. ప్రజలను నేరుగా కలుస్తా, ప్రజా దర్బార్‌లో సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం ఒక్కరోజు మాత్రమే ప్రజా దర్బార్‌లో ప్రజలను కలిశారని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారని, నిబంధనలకు లోబడే అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50రోజుల్లోనే రూ.14వేల అప్పులు తీసుకొచ్చారని, దీనికి సీఎం రేవంత్‌రెడ్డి ఏమని సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, రైతు బంధు పేరిట అన్నదాతలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడ్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రజలే చెప్పులతో కొట్టే రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఇవ్వడం లేదన్నారు.
ఇచ్చిన హామీలు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించడం దుర్మార్గమని తెలిపారు. హామీలను అమలు చేయడం చేతకాక కేసీఆర్‌ను, బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా ‘పంటలను ఎవడు వేయమన్నాడ్రా మిమ్మల్ని’ అని రైతులపై నోరు పారేసుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి భాష సరిగా లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెడ్తామని రేవంత్‌రెడ్డి అంటున్నాడని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలే రాజకీయంగా సమాధి చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
రైతులకు అండగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే : మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మాజీ సీఎం కేసీఆర్ పాలనలో అన్నదాతలు సంతోషంగా వ్యవసాయం చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. గతంలో సాగర్ రిజర్వాయర్‌లో 515 అడుగుల నీటిమట్టం ఉన్నప్పటికీ పంటలు ఎండిపోకుండా నీటిని విడుదల చేసి కాపాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. డ్యామ్‌లో 520 అడుగుల నీటి మట్టంతో 20 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 3 టీఎంసీల వరకు వాడుకునే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను కాపాడలేకపోతుందని విమర్శించారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో 119 గ్రామ పంచాయతీల పరిధిలో, మిర్యాలగూడ మున్సిపాలిటీలో 90శాతానికి పైగా రోడ్లను నిర్మించామని, ఎన్నో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందిందని, దీన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అస్ర్తాలుగా చేసుకొని ప్రజలను చైతన్య పర్చాలన్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన మాయమాటలను నమ్మి మోసపోయామని గ్రహించారని తెలిపారు. రాబోయే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, నాయకులు నల్లమోతు సిద్ధార్థ, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, మోసిన్‌అలీ, దుర్గంపూడి నారాయణరెడ్డి, లలిత, హాతీరాం, షహనాజ్‌బేగం, పాలుట్ల బాబయ్య, మట్టపల్లి సైదులు యాదవ్, షోయబ్ పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పజెప్పి రైతులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు మిర్యాలగూడలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.