హుజూర్నగర్, మార్చి20 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, పార్టీలోకి నాయకులు వస్తూ పోతూ ఉంటారని, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడిన వారి వల్ల నష్టంమేమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను తయారు చేసే కర్మాగారం లాంటిదన్నారు. నియోజకవర్గంలో పార్టీ చెక్కు చెదరలేదని, కేసీఆర్ వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతామని తెలిపారు. రాష్టంలో కరువు పైన ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందని, రైతుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. జిల్లాలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నా ఏనాడూ రైతుల గోసను పట్టించుకోలేదని మండిపడ్డారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతుంటే కాంగ్రెస్ నాయకులు పరామర్శించిన పాపాన పోలేదన్నారు. జిల్లా మంత్రులు అసమర్థత, చేతగాని తనం వల్ల గతంలో మాదిరిగానే కళ్లు గప్పి మన నీటిని తరలించుకుపోతున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కరువును అధిగమించేందుకు నిర్మించారని గుర్తు చేశారు.
మూడు పిల్లర్లు కుంగినంత మాత్రాన పెద్ద ఇబ్బంది లేదన్నారు. మోటర్ల ద్వారా నీటిని విడుదల చేస్తే సూర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్, మోతె, హుజూర్నగర్, కోదాడ మండలాలకు సాగునీరు వచ్చేదని చెప్పారు. రైతులకు కరెంటు ఇస్తే పంటలు బాగా పండి బోనస్ అడుగుతారనే దురుద్దేశంతోనే కరెంట్ ఉన్నా సరిగా రైతులకు ఇవ్వడం లేదని విమర్శించారు. రైతుబంధు పైసలు అడిగితే రైతులను చెప్పుతో కొడుతానన్న మంత్రి..ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ కాలేదని, ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100రోజుల్లోనే రూ.7.50 వేల కోట్ల అప్పు చేసిందన్నారు. కేసీఆర్ రైతు బంధు కోసం తయారు చేసిన రూ.7వేల కోట్లు, ప్రభుత్వ ఖజానాకు వచ్చిన రూ.20వేల కోట్ల ఆదాయం మొత్తం రూ.35వేల కోట్లను సర్కారు ఏమి చేసిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
బూటకపు హామీలు, అబద్ధాతో ప్రజలను మోసం చేసి 2శాతం ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా చెక్కు చెదరలేదని, గ్రామాల్లో ఇప్పటికే మార్పు మొదలైందన్నారు. తెలంగాణ ఏర్పాటును, కేసీఆర్ నాయకత్వాన్ని సహించలేని ఆంధ్రా మీడియా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు పిచ్చి పిచ్చి రాతలను రాస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిక్కు లేక, గెలిచే దమ్ములేక బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని మళ్లీ వారినే అభ్యర్థులను ప్రకటిస్తున్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఎప్పుడైనా కేసీఆర్ నాయకుడని, ఆయనకు ఎదురు నిలిచే ధైర్యం ఎవరికీ లేదన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, విజయసింహారెడ్డి, జడ్పీటీసీలు కొప్పుల సైదిరెడ్డి, జగన్, నాయకులు గుండా బ్రహ్మరెడ్డి, అమర్, నర్సింగ్ వెంకటేశ్వర్లు, సురేశ్, కృష్ణా నాయక్, బసవయ్య, పాలేటి రామారావు, రాంబాబు, అంజిరెడ్డి, పిచ్చయ్య, మంగమ్మ పాల్గొన్నారు.