నకిరేకల్/ హాలియా, మే 20 : కాంగ్రెస్, బీజేపీలను పట్టభద్రులు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నకిరేకల్, హాలియాలో సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మొన్నటి దాకా గుడి పేరు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు పొరుగు దేశం అడుక్కునేటట్లు చేసినమని చెప్పుకొంటున్నాడని, ఆ దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీయడం సరికాదని అన్నారు. ఏ దేశ ప్రజలైనా బాగుండాలని కోరుకోవాలే తప్ప.. వాళ్ల గురించి తప్పుడు మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. మోదీ పదేండ్ల పాలనలో సంవత్సరానికి రెండు కోట్ల చొప్పున దేశానికి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందన్నారు.
అవి ఇవ్వకపోగా.. 40 కోట్ల మంది భారతీయులకు అన్నం లేకుండా చేశాడని విమర్శించారు. దేశంలో ఇవాళ 40 కోట్ల మంది ప్రజలు ఒక్క పూట తిని బతుకుతున్నారని, రెండు పూటలా అన్నం తింటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. మోదీ 25 ఏండ్ల పాలనలో గుజరాత్లో కూడా ఇవాళ ఒక్క పూట మాత్రమే తిని కడుపు మాడ్చుకుంటున్న ప్రజలు చాలా మంది ఉన్నారన్నారు. శాసనసభ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ప్రశ్నించే గొంతుకను శాసన మండలికి పంపిస్తే ప్రభుత్వ మెడలు వంచి హామీలను అమలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన గోబెల్స్ వారసులకు, నాయకులకు పట్టభద్రులు కర్రు కాల్చి వాత పెట్టాలని సూచించారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదన్నారు. దందాలు చేసి కోట్ల రూపాయలు వెనుకేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బాగోతం బట్టబయలైందని, ఆయనతో పనిచేసిన వాళ్లే ఈ విషయం బయటకు చెప్తున్నారని చెప్పారు. బీజేపీ అభ్యర్థికి మాటలు వస్తయా.. రావా?, ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి విద్యావంతుడని, సొంతంగా ఎదిగి ప్రజా సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాడని తెలిపారు. కేసీఆర్ ఎక్కడ అని ప్రజలు వెతుక్కుంటున్నారని, మళ్లీ కేసీఆర్ రాజ్యమే వస్తుందని, బీఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహపడొద్దని భరోసా కల్పించారు. బూత్ ఇన్చార్జిలు పూర్తి బాధ్యతగా ఉండాలని, ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. హాలియాలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని పార్టీలకతీతంగా ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రతి గ్రాడ్యుయేట్ వద్దకు వెళ్లి రాకేశ్‌రెడ్డికి ఓటు వేసేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశాల్లో మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రాంచందర్‌నాయక్, మేడే రాజీవ్‌సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి, బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకుడు రాంబాబు యాదవ్, పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, కడారి అంజయ్య యాదవ్, అనుముల ఎంపీపీ సుమతీపురుషోత్తం, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్, తరాల బలరాం, నాయకులు పాల్గొన్నారు.
ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కొట్లాటలు, పోట్లాటలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నది. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. బీ ఫామ్ ఇచ్చిన ప్రతిఒక్కరూ ఎమ్మెల్యే అవుతారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించారు. ఈసారి కూడా రాకేశ్‌రెడ్డిని గెలిపించాలి.
– మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి అమెరికాలో బిట్స్ పిలానీ చదువుకున్న వ్యక్తి. పట్టభద్రుల సమస్యలపై అవగాహన ఉన్న ఆయన ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాడు. బూత్ ఇన్చార్జిలు బాధ్యతగా వ్యవహరించి పట్టభద్రులను కలిసి నీతి, నిజాయితీ ఉన్న రాకేశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి.
– మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య