నల్లగొండ, మార్చి 4 : భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక ఎండుతున్న పంటలను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అధికారులు కరువుపై పంట నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. నల్లగొండ పట్టణ సమీపంలోని కేశరాజు పల్లిలో నీరు లేక ఎండుతున్న వరి పొలాలకు ట్యాంకర్ ద్వారా రైతులు నీళ్లు పెడుతున్న విషయం నమస్తే తెలంగాణలో ప్రచురితం కాగా వారు అక్కడికి వెళ్లి పొలాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ దాసరి హరిచందనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ నీళ్లు లేకపోవడంతో ఒక్కో రైతు ఎకరానికి పెట్టిన 25 వేల రూపాయలు కోల్పోయినట్లేనన్నారు.
వేసిన పంటలు ఎండిపోయి పశువులు మేపుకొనే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు నింపితే కొంతమేర పంటలను కాపాడుకోవచ్చన్నారు. ఎస్ఎల్బీసీ ద్వారా చెరువులను నింపితే నల్లగొండ, దేవరకొండ, నకిరేకల్ ప్రాంతాల్లో పంటలు దక్కుతాయని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నీటి విడుదలకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. 40 నుంచి 50 శాతం పంటలు చేతికి వచ్చే సమయంలో ఎండిపోతున్నందున రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం, పట్టణ కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా కమిటీ సభ్యులు వీరపల్లి వెంకటేశ్వర్లు, పాలడుగు నాగార్జున, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పట్టణ నాయకులు కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, భూతం అరుణ, కేశరాజుపల్లి మాజీ సర్పంచ్ పొనుగోటి జనార్దన్రావు, రైతులు ముత్తినేని పరశురామ్, ముత్తినేని మురళి, చింతల దుర్గయ్య, నర్సిరెడ్డి, చింతల రామస్వామి, చింతల మధు, వెంకన్న పుల్లయ్య పాల్గొన్నారు.