ప్రజా వైద్యానికి పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తుంగతుర్తిలో 100 పడకల దవాఖాన ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేసింది. స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ కృషితో ఇప్పటికే రూ.40 కోట్లు మంజూరు చేయగా, ఈ నెల 29న భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. దాదాపు మూడున్నర లక్షల జనాభా గల తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు వంద పడకల దవాఖాన లేదు. అత్యవసర పరిస్థితుల్లోనూ సూర్యాపేటకు పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఈ భవనం ప్రారంభమైతే అధునాతన వైద్య పరికరాలు, 8 విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు, 24 గంటల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
– తుంగతుర్తి, సెప్టెంబర్ 23
తుంగతుర్తి, సెప్టెంబర్ 23 : గడిచిన 40 సంవత్సరాలుగా తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అరకొర వసతులతో డాక్టర్లు, సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. నియోజక వర్గ ప్రజల అవసరాలను గుర్తించిన ఎమ్మెల్యే గాదరి కిశోర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా చర్చలు జరిపి సమస్యను విన్నవించారు. అసెంబ్లీలోనూ ఏరియా దవాఖాన అవసరాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ చర్చించి రూ.40 కోట్ల నిధులను మంజూరు చేయించారు. తుంగతుర్తి ఏరియా నుంచి ప్రజలు ఏదైనా ప్రమాదాలకు గురైనా, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కేంద్రం సూర్యాపేటకు వెళ్లడానికి సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దాంతో కొంతమంది చికిత్స అందకుండానే మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు.
సమస్య తీవ్రతను గమనించి చలించిపోయిన ఎమ్మెల్యే తుంగతుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పట్టుబట్టి ఏరియా ఆస్పత్రిగా మార్చేందుకు కృషి చేశారు. ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేయడంతో 8 విభాగాల్లో ప్రత్యేక డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు రోగులకు సేవలందించనున్నారు. రక్త పరీక్షలు, ఎక్స్ రే విభాగం వంటి అధునాతన యంత్రాలతో సహా నూతన భవనం ఏర్పాటు కానున్నది. ఈ నెల 29న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.