హుజూర్నగర్, డిసెంబర్ 25 : అధికారుల అండదండలతోనే రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్నగర్ పట్టణంలోని రేషన్ దుకాణాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చాలా వ్యయంతో బియ్యాన్ని కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేస్తున్నదన్నారు. రేషన్ బియ్యం రీ సైక్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ కార్డులపై ప్రజలకు నాణ్యమైన బియ్యం అందజేస్తామన్నారు.
రాష్ట్రంలో 89 లక్షల కుటుంబాలకు 6కిలోల చొప్పున బియ్యం సరఫరా చేస్తున్నామని, రేషన్ బియ్యం పక్క దారి పట్టకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని మంత్రి చెప్పారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ రూ.56 వేల కోట్ల అప్పుల్లో, 11వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నదని తెలిపారు. మిల్లర్ల దగ్గర రూ.22వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కార్పొరేషన్ నిల్వ ఉంచిందన్నారు. రాష్ట్రంలోని ధాన్యాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్టాలకు అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రేషన్ బియ్యం పంపిణీని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు.