గరిడేపల్లి/ మఠంపలి/ హుజూర్నగర్ రూరల్, జనవరి 28 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని పొనుగోడులో ఆదివారం నిర్వహించిన ప్రాథమిక, ఉన్నత పాఠశాలల వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. పొనుగోడు గ్రామ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, నీటి సరఫరా, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే లైబ్రరీ నిర్మాణం, దాని అభివృద్ధికి మరో రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాన్ని పీహెచ్సీగా అప్‌గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానని హామీఇచ్చారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాలపై త్వరలో కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పొలాలకు నీటిని విడుదల చేయాలని పలువురు రైతులు కోరగా.. సాగర్‌లో నీరు తక్కువగా ఉన్నందున తాగునీటి అవసరాల రీత్యా సాగుకు నీళ్లివ్వలేమని చెప్పారు. అదేవిధఃగా మఠంపల్లి మండలం కృష్ణతండాలో, హుజూర్నగర్ మండలం లింగగిరిలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మఠంపల్లి మండలానికి ఉపాధిహామీ నిధులు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 540 సర్వే నంబర్లో భూములు కోల్పోయిన గిరిజన రైతులకు భూములు ఇప్పిస్తామని, గిరిజన రిజర్వేషన్లు పెంచుతామని హామీఇచ్చారు. త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. లింగగిరిలో రెండు అంగన్వాడీ భవనాల నిర్మాణానికి రూ.30 లక్షలు, శ్మశాన వాటిక, ఈద్‌గాహ్‌లకు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సాగు నీటి కోసం లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీఆర్డీఓ సుందరి కిరణ్‌కుమార్, డీఎస్పీ ముత్తినేని సోమనాథం, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, తాసీల్దార్లు బి.కవిత, నాగార్జునరెడ్డి, ఎంఈఓ చతృనాయక్, సర్పంచులు జోగు సరోజిని, బాణోతు రామారావు, కర్నాటి అంజిరెడ్డి, ఎంపీటీసీలు మేళ్లచెర్వు వెంకటరమణ, రాంమల్లమ్మ, విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ కట్టా గోపాల్‌రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి బపాల్గొన్నారు.