వానకాలం నాట్లు మొదలయ్యే నాటికే రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమచేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల ప్రకటించారు. సోమవారం నుంచే రైతుభరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి రైతునేస్తం కార్యక్రమం వేదికగా వెల్లడించారు. 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. తొలిరోజు రెండెకరాల వరకు 6,11,838 మంది రైతులకు రూ.356,19,40,839 అందజేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా…ఈ సారైన పూర్తిస్థాయిలో రైతుభరోసా అందుతుందా అన్నది ప్రస్తుతం రైతుల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పైగా యాసంగిలో మిగిలిపోయిన రైతుల పరిస్థితి ఏంటన్నది స్పష్టత లేదు. కేసీఆర్ సర్కార్ హయాంలో వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతుందంటే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యేది. కానీ, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటిని నుంచి మూడు సీజన్లు ముగిసినా ఎప్పుడూ పూర్తిస్థాయిలో భరోసా రైతులకు అందింది లేదు.
గత యాసంగిలో అట్టహాసంగా ఎకరాకు ఆరు వేల చొప్పున రైతుభరోసా ప్రతి రైతుకు అందించనున్నట్లు ప్రకటించి, నాలుగు ఎకరాల రైతుల వరకు ముగించేశారు. దీంతో మిగతా రైతులకు నేటికీ ఎదురుచూపులు తప్పడం లేదు. ఇక వానకాలం సీజన్ పనులు మొదలైన నేపథ్యంలో ఈ సారైనా పూరిస్థాయిలో అందరి రైతులకు భరోసా నిధులు జమ చేస్తారా? లేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి.
నల్లగొండ ప్రతినిధి, జూన్16 (నమస్తే తెలంగాణ): ‘ఈ ఏడాది మార్చి 31 వరకు అర్హులైన ప్రతి రైతుకు ఎకరాకు రూ.6వేల చొప్పున రైతుభరోసా అందించి తీరుతాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి గత జనవరి 26న పైలెట్ గ్రామాల్లో పథకాలను ప్రారంభిస్తూ అట్టహాసంగా ప్రకటించారు. కానీ యాసంగి సీజన్లో అప్పటి నుంచి జరిగేందేమిటీ? కేవలం పైలెట్ గ్రామాల్లోని రైతులందరికీ మాత్రమే రైతుభరోసా డబ్బులు అం దాయి. మిగతా గ్రామాల్లోని రైతుల్లో సగానికి పైగా ఎదురుచూపులు తప్పలేదు.
యాసంగి సీజన్లో నాలు గు విడతల్లో కేవలం నాలుగు ఎకరాల విస్తీర్ణం వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతుభరోసా డబ్బులు ఖాతాల్లో జమచేశారు. ఆపై విస్తీర్ణం ఉన్న రైతులకు నేటికీ భరోసా డబ్బులు ప్రభుత్వం విడుదల చేయలేదు. వరంగల్ రైతు డిక్లరేషన్, ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ఏడాదికి రూ.15వేల రైతుభరోసా హామీని తుంగలో తొక్కుతూ రూ.12వేలు మాత్రమే ఇస్తానని చేసిన ప్రకటన కూడా ఆచరణ కు నోచుకోలేదు.
గత వానకాలం సీజన్లో అనర్హుల ఏరివేత పేరు తో అభిప్రాయాలు, చర్చలు, సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ మొత్తానికే డబ్బులు ఎగొట్టిన విషయం తెలిసిందే. ఇక యాసంగి నుంచి ఎకరాకు రూ.6వేల మాత్రమే ఇస్తామని చెప్పి, అది కూడా పూర్తి చేయలేదు. సీఎం స్వయంగా బహిరంగసభ వేదికగా ‘రాష్ట్రంలోని సాగుయోగ్యమైన ప్రతి ఎకరాకు మార్చి 31లోగా రైతుభరోసా డబ్బులు పూర్తిగా చెల్లిస్తామని‘ ఆర్భాటంగా చేసిన ప్రకటనకే దిక్కులేకపోతే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా గత యాసంగిలో ఉమ్మడి జిల్లా రైతులకు సుమారుగా రూ.1575 కోట్ల రైతుభరోసా డబ్బులు అందాల్సి ఉంది. కానీ నాలుగు ఎకరాల వరకే పరిమితం చేయ డం వల్ల సుమారు రూ.800 కోట్ల వరకే రైతుల ఖాతా ల్లో పడ్డాయి. మిగతా రైతులంతా నేటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు.
ప్రస్తుత సీజన్లోనైనా…
ప్రభుత్వ తీరు చూస్తుంటే ఈ సీజన్లోనైనా పూర్తిగా ఇస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా కిం దటి సీజన్‌తో పాటు ప్రస్తుత వానకాలం కలిపి మొత్తం రూ.2300 కోట్ల రూపాయలు కేటాయిస్తానే ఉమ్మడి జిల్లా రైతులకు పూర్తిస్థాయిలో రైతుభరోసా అందనుంది. కానీ ప్రభుత్వం సమకూరుస్తున్న ఆదాయవనరులను పరిశీలిస్తే గత యాసంగిలో మిగిలిపోయిన రైతు భరోసా ఇస్తారన్న గ్యారంటీ కనిపిస్తలేదని రైతుసం ఘం నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వానకాలం రైతుభరోసాను పూర్తి చేయాలన్న మరిన్ని నిధు లు సమీకరణ అవసరమన్న అభిప్రాయలు వస్తున్నా యి. ఉమ్మడి జిల్లా రైతులకు ప్రస్తుతం వానకాలంలోనే రూ.1575 కోట్ల వరకు రైతుభరోసా నిధులు అవసరం అవుతాయన్న అంచనాలు ఉన్నాయి. తాజా గా కొత్త రైతుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంటున్న నేపథ్యంలో ఈ మొత్తం పెరగవచ్చని తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో 26 లక్షల ఎకరాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతుభరోసా అందాల్సిన భూమి విస్తీర్ణం సుమారు 26లక్షల ఎకరాల వరకు ఉన్నట్లు అంచనా. దీనికి సంబంధించి రైతుల సంఖ్య 11.50లక్షలకు పైచిలుకు ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీరికి సంబంధించి సుమారుగా రూ.1575 కోట్ల వరకు రైతుభరోసాగా ఇవ్వాల్సి ఉంటుందని ప్రాథమిక అంచనా. కేసీఆర్ సర్కార్ హయాంలో చివరి సారిగా 2023 వానకాలంలో రైతుబంధును అమలు చేశారు. అదివరుసగా 11వ సీజన్ రైతుబంధు కావడం విశేషం. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలో సుమారు 26లక్షల ఎకరాలకు సంబంధించిన 10.80 లక్షల మంది రైతులకు రూ.1250 కోట్లను పెట్టుబడి సాయంగా అందించారు.
అదే ఏడాది ఎన్నికల సమయంలోనూ యాసంగి రైతుబంధు అమలుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధం కాగా, కాంగ్రెస్ నేతలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇవే డబ్బులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎకరాకు కేసీఆర్ మాదిరిగానే ఆదే రూ.ఐదు వేల చొప్పున తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చారు. ఆ తర్వాత గత వానకాలం నుంచి ఎకరాకు రూ.7500 చొప్పున రైతుభరోసా ఇస్తామని చెప్పి సర్వేలు, అభిప్రాయ సేకరణలు, చర్చోపచర్చల పేరిట మొత్తానికే ఎగనామం పెట్టిన విషయం తెలిసింది.
ఇక యాసంగిలోనైనా పూర్తి స్థాయిలో ఇస్తారనుకుంటే అది కూడా మధ్యలోనే ఆపేశారు. ఇక మళ్లీ ప్రస్తుత వానకాలంలో రైతుభరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారైనా పూర్తిస్థాయిలో ఇస్తారా? లేదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఎన్నడూ రైతుబంధు డబ్బుల కోసం ఎదురు చూడాల్సి రాలేదని రైతులు గుర్తు చేస్తున్నారు. కాం గ్రెస్ సర్కార్ వచ్చిన నాటి నుంచి పెట్టుబడుల కోసం మళ్లీ వడ్డీ వ్యాపారుల గడపతొక్కాల్సి వస్తుందని, రైతు లు మండిపడుతున్నారు.