అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి, అదీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రేవంత్‌రెడ్డి నల్లగొండకు వస్తుండడంపై జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. మిగిలి ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల మంజూరుతో పాటు కొత్త ప్రాజెక్టులు, పనులకు వరాలు కురిపిస్తారని ఆశించారు. కానీ అలాంటి వాటికి రేవంత్‌రెడ్డి ప్రసంగంలో చోటు దక్కలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అడ్డదిడ్డమైన ఆరోపణలతోపాటు కేసీఆర్‌పై ఎప్పటిలాగే వ్యాఖ్యలతో రేవంత్ ప్రసంగం సాగింది. ఇక ప్రజలు వద్దంటున్న ఫ్యూచర్ సిటీని 50వేల ఎకరాల్లో నిర్మించి తీరుతామని, ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదని, ట్రిపుల్ ఆర్‌ను ఇప్పటిలాగే నిర్మించి తీరుతామని శపథం చేశారు. ఏదైనా కొత్తగా చేపట్టాలి అంటే ఏదో ఒకటి, ఎవరో ఒకరు కోల్పోక తప్పదంటూ బలవంతపు భూ సేకరణను, ప్రస్తుత అలైన్‌మెంట్‌ను వ్యతిరేకిస్తున్న ప్రజలకు పరోక్ష హెచ్చరికలు సైతం చేయడం గమనార్హం.
నల్లగొండ జిల్లా పరిధిలో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి రేవంత్ పర్యటన కొనసాగింది. ముందుగా బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకం పైలాన్‌ను ఆవిష్కరించి రిజర్వాయర్ వద్ద గంగా హారతి ఇచ్చి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులో రెండో యూనిట్ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టి జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత చివరగా నల్లగొండ మెడికల్ కాలేజీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఏడాది పాలన విజయోత్సవ సభలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ముందుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. అనంతరం సీఎం ప్రసంగించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్‌రెడ్డి నల్లగొండ గడ్డపై అడుగు పెట్టడంతో భారీగా వరాలు ప్రకటిస్తారని అందరూ ఆశించారు. శనివారం ప్రారంభించిన అన్ని పనులు కూడా కేసీఆర్ హయాంలో చేపట్టినవే. చివరి దశలో ఉన్న వాటికి తుది మెరుగులు దిద్ది కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ప్రారంభించిన విషయం తెలిసిందే. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం మార్క్ ఉండేలా సీఎం రేవంత్‌రెడ్డి కొత్తగా వరాలు ప్రకటిస్తారని ఆశించగా నిరాశే మిగిలింది.. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులో ఇంకా కీలకమైన భూ సేకరణ మిగిలే ఉంది. ఇది పూర్తయితేనే ఎడమ, కుడి కాల్వలతోపాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వలు తవ్వాల్సి ఉంటుంది. దీని కోసం కనీసం రూ.300 కోట్లు అవసరం అవుతాయని అధికారుల అంచనా. ఇవ్వాల అసంపూర్తి ప్రాజెక్టును ప్రారంభిస్తున్న సందర్భంగా మిగతా పనుల కోసం రేవంత్‌రెడ్డి నిధులు మంజూరు చేస్తారని ప్రజలు భావించారు.
కానీ ఒక్క పైసా కూడా దాని కోసం ప్రత్యేకంగా రేవంరెడ్డి ప్రకటించ లేదు. తక్షణం అవసరం ఉన్న రూ.72కోట్ల నిధుల ఊసు కూడా లేదు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక్క ప్రకటన కూడా సీఎం నోటా రాలేదు. నల్లగొండ మెడికల్ కాలేజీకి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరగాల్సి ఉంది. దీనిపైనా రేవంత్‌రెడ్డి ప్రకటన చేస్తారని ఆశించగా నిరాశే మిగిలింది. జిల్లాలో ఇంకా రెండు లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నట్లు అంచనా. దీనిపైన సీఎం మాట్లాడుతున్నారని అనకున్నా ఆ ప్రస్తావనే లేదు. ఆ ముచ్చట తీసుకురాండా ఇప్పటికే నల్లగొండ జిల్లాకు రూ.2,004 కోట్ల లబ్ధి జరిగిందంటూ గొప్పలు చెప్పబోయారు. రైతుభరోసా మాత్రం సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం ఒక్కటే ఊరట కలిగించేదిగా ఉంది. అది కూడా పెండింగ్‌లో ఉన్న వానకాలం రైతుభరోసానా, ప్రస్తుత యాసంగికి సంబంధించినదా అనేది స్పష్టం చేయలేదు.
మంత్రి కోమటిరెడ్డి అడిగినా..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండకు డెంటల్ కాలేజీ మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అయినా దీనిపై రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో దాటవేత వైఖరిని కనబర్చారు. కోమటిరెడ్డి ఏవోవే రాసిస్తూ తనకు పేపర్లు ఇస్తున్నారంటూ ప్రస్తావించారు. కానీ అవి ఏంటో చెప్పలేదు. వాటికి నిధులు ఇస్తున్నట్లు కూడా ప్రకటించపోవడం విస్మయం కలిగించింది. ఇక వాటితోపాటు జిల్లాలోని పలు పెండింగ్ పనులపైనా ప్రజాప్రతినిధులు ఆశలు పెట్టుకున్నారు. వాటిల్లో వేటికీ కొత్తగా రేవంత్‌రెడ్డి నోట నిధుల ప్రస్తావన రాలేదు. ఇదే సమయంలో ప్రజలు డిమాండ్ చేస్తున్న ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుతోపాటు మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లింపులపైనా ప్రస్తావన లేదు. ఎప్పటిలాగే అడ్డదిడ్డమైన మూసీ ప్రక్షాళన చేసి తీరానని, అక్కర లేని ఫ్యూచర్ సిటీని 50వేల ఎకరాల్లో నిర్మించి తీరుతానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
రాజగోపాల్‌రెడ్డి డుమ్మా
సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కీలక మంత్రులంతా హాజరైన నల్లగొండలోని బహిరంగ సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డుమ్మా కొట్టారు. కేవలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు వద్ద జరిగిన పూజా కార్యక్రమానికే రాజగోపాల్‌రెడ్డి పరిమితమయ్యారు. వాస్తవంగా దానికి కూడా రాజగోపాల్‌రెడ్డి వస్తారా, లేదా అన్న సంశయం కొనసాగింది. తన స్వగ్రామం అవడం, తమ ప్రాంత ప్రయోజనాలతో కూడుకున్న ప్రాజెక్టు అవడంతో దీనికి మాత్రమే హాజరై వెళ్లిపోయనట్లు తెలిసింది. నల్లగొండలో మెడికల్ కాలేజీ ఓపెనింగ్‌కు గానీ, బహిరంగ సభకు గానీ ఆయన రాలేదు. మునుగోడు నియోజకవర్గం నుంచి కూడా సీఎం సభకు పెద్దగా జన సమీకరణ చేయలేదు. వెళ్లే వాళ్లను వద్దన లేదు.. కావాలని పట్టుబట్టి ఎవరినీ పొమ్మని చెప్పలేదని తెలిసింది. తనకు మంత్రి పదవిపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆగ్రహంతో రాజగోపాల్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆసక్తి కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.