దండు మల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో స్థానిక యువతకు ప్రాధాన్యం ఇస్తామని, సుమారు 40వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో పలు పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వేల మందికి నైపుణ్య శిక్షణ ఇస్తారని.. మునుగోడు, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రీన్ పార్క్‌లో మొత్త 1,850 ఎకరాలకు నీటి సౌకర్యం కల్పిస్తామని, అందుకోసం వెంటనే టీఎస్ఐఐసీకి ఆదేశాలిస్తామని తెలిపారు. 106 ఎకరాల్లో టాయ్స్ పార్క్‌కు భూమి పూజ చేసుకున్నామని, ఇక్కడికే రైస్ హబ్ రాబోతున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పరిశ్రమలు తరలిపోతాయని, కరంట్ లేక అంధకారం అవుతుందని నాడు భయభ్రాంతులకు గురిచేశారని, కానీ స్వరాష్ట్రంలో అందుకు భిన్నంగా పాలన కొనసాగుతున్నదని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం మన రాష్ట్రంలో ఉన్నదని, పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
– యాదాద్రి భువనగిరి, జూన్ 6 (నమస్తే తెలంగాణ)
యాదాద్రి భువనగిరి, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : దండుమల్కాపురం గ్రీన్ పార్క్‌లో స్థానిక యువతకు అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రీన్ పార్క్ ద్వారా సుమారు 40వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. మునుగోడు, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల యువతకు అవకాశాలు కల్పిస్తే సంతోషంగా, సంబురంగా పని చేస్తారని తెలిపారు. ప్రభుత్వం అందించే రాయితీలు అందిపుచ్చుకొని పరిశ్రమల రంగంలో ఎదుగాలని, తద్వారా ఉపాధి అవకాశాలు పెంచి.. సమాజాభివృద్ధికి పాటుపడాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం గ్రీన్ పార్కులో కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గ్రీన్ పార్కులో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వేల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రీన్ పార్కులోని మొత్తం 1,850 ఎకరాలకు నీటి సౌకర్యం కల్పిస్తామని, ఈ మేరకు వెంటనే టీఎస్ఐఐసీకి ఆదేశాలిస్తామని పేర్కొన్నారు. 106 ఎకరాల్లో టాయ్స్ పార్కుకు భూమి పూజ చేసుకున్నామని, అదేవిధంగా ఇక్కడకు రైస్ హబ్ రాబోతున్నదని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు రానున్నట్లు తెలిపారు. పరిశ్రమ రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉన్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ ఇచ్చే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెలంగాణలో ఉన్నదని చెప్పారు. తెలంగాణ వస్తే పరిశ్రమలు తరలిపోతాయని, కరెంట్ లేక అంధకారం అవుతుందని నాడు భయభ్రాంతులకు గురిచేశారని, కానీ.. స్వరాష్ట్రంలో అందుకు భిన్నంగా పాలన కొనసాగుతున్నదని తెలిపారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయని, ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే 24గంటల విద్యుత్ సాధ్యమైందని గుర్తు చేశారు.
ప్రధాని మోదీ గొప్పగా చెప్పుకొనే గుజరాత్లో వారానికి రెండు రోజులు పవర్ హాలీడే ప్రకటించారని, మన దగ్గర మాత్రం నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందుతున్నదని వివరించారు. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం చేసిన వాస్తవ విజయాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ట్రైకార్ చైర్మన్ రాంచందర్‌నాయక్, గీత సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ తదితరులు పాల్గొన్నారు.
మరో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు
దండు మల్కాపురం గ్రీన్ పార్కులో ఒకేసారి 51 పరిశ్రమలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ కలలు గన్నట్లు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు రూపుదిద్దుకున్నది. ఇక్కడ పెట్టుబడులు పెడుతామంటూ పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. ఈ గ్రీన్ పార్కు సరిపోవడం లేదు. 400 నుంచి 500 ఎకరాల్లో మరో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని మంత్రి కేటీఆర్‌ను కోరుతున్నాం. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు సులభతరం అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రోత్సాహకాలతో 2014 తర్వాత పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.
– టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు
టాయ్స్ పార్కు 16 యూనిట్లకు రూ.195 కోట్ల పెట్టుబడులు
చౌటుప్పల్, జూన్ 6 : ప్రస్తుతం టాయ్స్ పార్కులో మొదటి 16 యూనిట్లను కేటాయించామని, వాటికి రూ.195 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 2,900 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం టాయ్స్ పార్కు శంకుస్థాపనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత 16 యూనిట్లకు 38 ఎకరాలు కేటాయించామని, మరో 50 ఎకరాలు కేటాయించనున్నామని అన్నారు. తెలంగాణ టాయ్స్ పార్కు సంస్కృతి కొత్తది కాదని.. నిర్మల్, చేర్యాల చెక్క బొమ్మలు ఎన్నో రూపాలతో కళాకారులు తయారు చేయడం చూశామని చెప్పారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి, అభిరుచులకు, అవసరాలకు తగ్గట్టుగా ఈ బొమ్మలు తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తున్నదన్నారు. బొమ్మలు ఎక్కువగా చైనా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్నాయని, దానిని తగ్గించి భారత్‌పాటు ఇతర రాష్ర్టాల పిల్లలకు మన బొమ్మలను అందించాలని టాయ్స్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
మోడర్న్ థింకింగ్ లీడర్ కేటీఆర్
35 సంవత్సరాల ఇండస్ట్రియల్ హిస్టరీలో కంట్రీలో టాప్‌మోస్ట్ రిఫార్మింగ్ పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా ఉన్నారంటే అది మంత్రి కేటీఆరే. ఆయనకు తెలియని విషయం ఏంటంటే.. కేటీఆర్‌కు అన్ని పార్టీల్లో అభిమానులు ఉంటారు. అన్ని పార్టీల్లో వాళ్లు కూడా ప్రైవేటుగా ఇలాంటి వ్యక్తులే రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లగలరని చెబుతుంటారు. పబ్లిక్‌గా రాజకీయంగా ఏదైనా మాట్లాడొచ్చు. కానీ.. ప్రైవేట్‌గా కేటీఆర్‌ను అందరూ అంగీకరిస్తారు. రాష్ట్రం అభివృద్ధ్ది జరిగితేనే దేశం అభివృద్ధి జరుగుతుంది. అధికారం కోసం అడ్డదారులు తొక్కకుండా ఫర్పార్మెన్స్ బేస్డ్గా అనేక పథకాలను పక్కాగా అమలు చేస్తున్నారు. కంట్రీ ఇండస్ట్రియల్ సెక్టార్‌లోనూ సురేశ్‌ప్రభు, అరుణ్‌జైట్లీ మాదిరిగానే చక్కటి అభివృద్ధిని చూపే శక్తి మంత్రి కేటీఆర్‌లో ఉన్నది. నెహ్రూ చూపిన దార్శనికత మాదిరిగా.. విద్య, విజ్ఞానం, వైజ్ఞానిక రంగాల ద్వారా మాత్రమే పేదరికం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలను ఎదుర్కోవాలనే ఒక మోడ్రన్ థింకింగ్ ఉన్న లీడర్ కేటీఆర్. అటువంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో అవసరం.
– తూడి దేవేందర్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త
ఏ పల్లెకు తెలంగాణ ప్రగతి తెలుస్తుంది..
చౌటుప్పల్, జూన్ 6 : తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగింది. ఏ రంగంలో జరిగింది? మేము ఉన్నప్పుడే చేసినమని కొంతమంది మాట్లాడుతున్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో వ్వవసాయ రంగం ప్రగతిని ఏ మారుమూల ప్రాంతం వెళ్లినా చెప్తారు. విద్యుత్ రంగంలో వచ్చిన మార్పును ల్యాండ్రీ, హెయిర్ సెలూన్, ఏ కిరాణా దుకాణానికి వెళ్లినా సమాధానం దొరుకుతుంది. 2014లో పరిశ్రమల పరిస్థితి ఎట్లా ఉండేది.. ఇప్పుడెలా ఉన్నదో గమనించాలి. గతంలో పారిశ్రామిక వేత్తలకు సముచిత స్థానం లేదు. ప్రస్తుతం ఉపాధి కల్పించే రాష్ట్రంగా పేరు పొందింది. దీనికంతటికీ కారణం సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.
– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
30వేల మందికి ఉద్యోగాలు
ఈ ప్రాంతంలో 30వేల మందికి ఉద్యోగాలు రావడం సంతోషకరం. టాయ్స్ పార్కు ఏర్పాటు చేసుకోవడం అదృష్టంగా భావించాలి. గతంలో మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నప్పుడు సీఎం రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇక్కడ డంప్ యార్డు ఏర్పాటుకు జీఓ తెచ్చారు. అప్పుడు తెలంగాణ వస్తది.. స్వరాష్ట్రంలో తిప్పికొడుదామని చెప్పాను. దాంతోనే ఈ ప్రాంత ప్రజలు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు.
– ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
అడిగిన వెంటనే భూమి కేటాయించారు
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో యూనిట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాం. వెంటనే ఇంటర్వ్యూకు పిలిచారు. డీపీఆర్ రిపోర్టును టిఫ్ నిర్వాహకులకు అందజేశాం. దాంట్లో డీఆర్డీఎల్, బీడీఎల్‌కు ముడి సరుకులు అందించడం కోసం 2.20 ఎకరాల భూమి కోవాలని కోరాం. అడిగిన వెంటనే 2.10గుంటలు కేటాయించారు. ఏడాదిన్నర క్రితం రూ.3.50కోట్లతో పరిశ్రమకు శంకుస్థాపన చేశాం. పనులు పూర్తి కావస్తున్నాయి. గతంలో వారంలో నాలుగు రోజులు మాత్రమే పవర్ ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 24గంటల విద్యుత్ అందిస్తున్నది. దీంతో ఎలాంటి ఇబ్బందులు కలుగడం లేదు. అన్ని వసతులు బాగున్నాయి. హైదరాబాద్‌కు దగ్గరలో ఉండటంతో రవాణా సమస్య కూడా లేదు. పార్కులోకి రాగానే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తున్నది.
– రామనాథం రవళి, పైడికొండ టెక్నాలజీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమ నిర్వాహకురాలు
వినమ్రపూర్వక అభినందనలు
అప్పట్లో కరెంటు కోసం ఇందిరాపార్కు వద్ద, ప్రతి సబ్‌స్టేషన్‌లో ధర్నాలు చేశాం. తెలంగాణ వస్తే కరెంటు వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలన్న పరిస్థితి వస్తుందన్న భయం కల్పించారు. మేమంతా తీవ్ర ఆందోళన చెందాం. కానీ తెలంగాణ వచ్చాక ఆరు నెలల్లోనే మన బాధలన్నీ తీరినయ్. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఇందుకు తెలంగాణ పరిశ్రమల యజమానుల తరఫున వినమ్రపూర్వక అభినందనలు. నా సొంత పరిశ్రమ విషయానికి వస్తే.. 2012-13లో నా కంపెనీ టర్నోవర్ రూ.1.50 కోట్లు మాత్రమే. ఈ రోజు టర్నోవర్ రూ.49 కోట్లు. ఇది బంగారు తెలంగాణ. సీఎం కేసీఆర్ బాటలో నేను కూడా వెళ్తున్న. అప్పుడు నా కంపెనీలో 20 మంది పనిచేస్తే.. నేడు 200 మంది పని చేస్తున్నారు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర ఘనతే.
– స్వామిగౌడ్, గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియా అధ్యక్షుడు
చిత్తశుద్ధి ముఖ్యం.. అది నేడు ఉంది
2014కు ముందు, తర్వాత అని కాదు. ఎన్ని పాలసీలు వచ్చినా.. డిజైన్ చేసినా.. దాని అమలుకు చిత్తశుద్ధి కావాలి. కానీ.. 2014కు ముందు పాలకుల్లో ఈ చిత్తశుద్ధి అస్సలు లేదు. నేడు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి, ఆలోచనలు.. వాటిని అమలు చేసే శక్తిసామర్థ్యాలు ఉన్న కేటీఆర్ పరిశ్రమల మంత్రిగా ఉండడం మన అదృష్టం. కొత్త రాష్ట్రంలో 23వేల పరిశ్రమలు, 2.60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పట్టుదల ఉన్న సీఎం కేసీఆర్, దాన్ని అమ లు చేసే మంత్రి కేటీఆర్ ఉండడం ఇక్కడ బలం. స్థిరమైన నిర్ణయాలతోనే విజయాలు సాధ్యం. ఈ ప్రభుత్వం ఇలాగే చాలా రోజులు ఉండాలి. అందరం కలిసి నిలబెట్టుకోవాలి. కేటీఆర్ లాంటి వ్యక్తి అన్ని రాష్ర్టాలకు పరిశ్రమల మంత్రిగా ఉంటే దేశం కూడా బాగుపడుతుంది.
– షేక్ జానీమియా, ఐడీఎంఏ చైర్మన్