యాదాద్రి భువనగిరి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : చిట్యాల రోడ్‌షోలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్, పక్కన నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, ఎంపీ బడుగుల, జడ్పీ చైర్మన్లు బండ నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు దూదిమెట్ల బాలరాజు యాదవ్, చెరుకు సుధాకర్, చాడ కిషన్‌రెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి, ప్రసన్నరాజ్ తదితరులు ‘పదేండ్ల క్రితం నకిరేకల్ నియోజకవర్గం ఎట్లుండే. ఇప్పుడు ఎైట్లెంది. అభివృద్ధి చేస్తున్నడని లింగన్నను ఓడించాలని చూస్తున్నరు. కాంగ్రెస్ కుట్రలకు ఆగం కావద్దు. గందరగోళపడొద్దు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే లింగన్నను ఆశీర్వదించండి. కోమటిరెడ్డి బ్రదర్స్ పైసలు పంచుతరు, తీసుకున్నా కారు గుర్తుకే ఓటేయండి. మళ్లీ మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చిట్యాల పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా మంత్రి కేటీఆర్ మంగళవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని సర్వనాశనం చేసిందని, నాటి కరెంట్ కష్టాలు యాది తెచ్చుకోవాలని కోరారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ గంగిరెద్దులా వస్తున్నాయని, ఆ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చిరుమర్తి గెలిస్తే చిట్యాలలో పాలిటెక్నిక్ కాలేజీ, ఫ్లైఓవర్, వెలిమినేడులో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిట్యాల రోడ్ షో ఎన్నికల ప్రచార సభలా లేదని, చిరుమర్తి లింగయ్య విజయోత్సవ సభలా ఉన్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
‘సమైక్య పాలనలో నకిరేకల్ నియోజకవర్గం ఎట్లుండె.. ఇప్పుడు ఎైట్లెంది.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న లింగన్నను ఓడించాలని చూస్తున్నరు.. వారి కుట్రలకు ఆగం కావద్దు.. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే లింగన్నను ఆశీర్వదించండి..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం చిట్యాల పట్టణంలో చిరుమర్తికి మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని సర్వనాశనం చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు యాది తెచ్చుకోవాలన్నారు. నాడు పవర్ హాలిడేలు, వ్యవసాయానికి కరెంట్ లేక అరిగోస పడ్డారని గుర్తు చేశారు. ఎందరో రైతులు రాత్రిపూట పాములు, తేళ్లు కుట్టి మృత్యువాత పడ్డారని వివరించారు. పల్లెల్లో ఎవరైనా చనిపోతే.. కరెంట్ కోసం అధికారులకు ఫోన్లు చేసి అర్ధగంట ఆన్ చేయాలని బతిమిలాడుకున్న పరిస్థితులు ఉండేవన్నారు. స్వరాష్ట్రంలో 24 గంటల కరెంట్, సాగునీరు, తాగునీరు అందించామన్నారు. కాంగ్రెస్ నేతలకు కర్ణాటక నుంచి పైసలు వస్తుండడంతో బలిసికొంటుకుంటున్నారని మండిపడ్డారు.
వచ్చే నెల 3 నుంచి కొత్త పథకాలు..
వచ్చే నెల మూడో తేదీన గెలవగానే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికిఈ కేసీఆర్ బీమా అమలు చేస్తామని, దీని ద్వారా రూ.5 లక్షల సాయం అందుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం ఇస్తామని, ఇప్పటికే స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం అమలవుతున్నదని చెప్పారు. 18ఏండ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ. 3 వేలు బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని చెప్పారు. 2014లో గ్యాస్ బండ 400 ఉంటే, మోదీ రూ.1,200 చేశారని మండిపడ్డారు. పెరిగిన రూ.800 భారాన్ని సీఎం కేసీఆర్ భరించి రూ.400కే గ్యాస్ బండ ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. నకిరేకల్ నియోజకవర్గంలో 92,365 మందికి రైతు బంధు వస్తుందని, అధికారంలోకి రాగానే ఏటా రూ.16 వేలు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. 48,892మందికి ఆసరా పింఛన్లు ఇచ్చామని, కాంగ్రెస్ వాళ్లు ఓట్లకొస్తే ముసలోళ్లు కర్రతో కొట్టాలన్నారు. త్వరలో పింఛన్‌దారులకు రూ.5 వేల పింఛన్ రాబోతున్నట్లు చెప్పారు. ‘నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేటోళ్లని, నేడు కేసీఆర్ కిట్‌తో నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు’ అంటున్నారని చెప్పారు. రామన్నపేటలో 50 పడకల ఆస్పత్రి, నకిరేకల్‌లో 100 పడకల ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.
గుద్దుడు గుద్దుడే
చిట్యాలలో పాలిటెక్నిక్ కాలేజీ కావాలని చిరుమర్తి లింగయ్య అడిగారని, ఆయన్ను గెలిపిస్తే కళాశాల వస్తుందన్నారు. చిట్యాలలో ఫ్లైఓవర్, వెలిమినేడులో ఉద్యోగాల కోసం ఇండస్ట్రియల్ పార్కు, బ్రాహ్మణవెల్లంల పూర్తి కావాలంటే బీఆర్ఎస్కు ఓటు చేయాలని పిలుపునిచ్చారు. ఉదయం సముద్రం, పిలాయిపల్లి కాల్వ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ మరోసారి గెలిస్తే పేదలకు మంచి జరుగుతుందన్నారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే అని అన్నారు. అధికారంలోకి రాగానే బ్రాహ్మణవెల్లెంలను 9నెలల్లో పూర్తి చేస్తామని, కరోనా ఇబ్బందులతో పెండింగ్‌లో పడిందని వివరించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మదమెక్కి విర్రవీగుతున్నారని, నల్లగొండ, మునుగోడులో వారు ఓడిపోతారని, అక్కడ బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చీము, నెత్తురు, రోషం ఉందా? అని ధ్వజమెత్తారు. పరిశ్రమలు రావాలంటే స్టేబుల్ లీడర్, స్టేబుల్ ప్రభుత్వం ఉండాలన్నారు. కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా..? అనేది ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్లు బండానరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు చెరుకు సుధాకర్, చాడ కిషన్‌రెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్ పాల్గొన్నారు.
ప్రాణం ఉన్నంత వరకు ప్రజలతోనే : ఎమ్మెల్యే చిరుమర్తి
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. నా బొందిలో ప్రాణమున్నంత వరకు ప్రజలతోనే ఉంటానని, ప్రజల కోసమే పనిచేస్తానని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని తెలిపారు. తాను 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనపై, కార్యకర్తలపై జరుగుతున్న దౌర్జన్యం ప్రజలందరికీ తెలుసని, అదే సమయంలో సీఎం కేసీఆర్ పిలుపుతో నియోజకవర్గం అభివృద్ధ్ది, ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని పార్టీ మారక తప్పలేదని వివరించారు. బీఆర్ఎస్లోకి వచ్చాక వందల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధ్ది చేశానన్నారు. పార్టీ మారనన్న అక్కసు, నియోజకవర్గ అభివృద్ధి చూసి ఓర్వలేని కోమటిరెడ్డి బ్రదర్స్ తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలే నా బలమని, తనను మరోసారి ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధ్ది చేస్తానని చెప్పారు. చిట్యాలకు పాలిటెక్నిక్ కళాశాల, పట్టణంలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జిని, వెలిమినేడు సమీపంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను కోరారు.
చిరుమర్తి గెలుపుతోనే అభివృద్ధి : ఎంపీ బడుగుల
చిట్యాల : నకిరేకల్ ఎమ్మెల్యేగా చిరుమర్తి లింగయ్య మరోసారి గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధ్ది చెందుతుందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండే చిరుమర్తికి ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఆ అవగాహన, అనుభవంతో ఇప్పటికే నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, అలాంటి వ్యక్తిని మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాడని అన్నారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్‌కు ఓటు వేస్తే నిరుపయోగంగా మారుతుందన్నారు. చిరుమర్తి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.