నీలగిరి, జూన్ 9: నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో మళ్లీ ఫ్లెక్సీ ల లొల్లి ప్రారంభమైంది. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక నాటి నుంచి కాంగ్రెస్లో ఈ పోరు మొదలైంది. డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాస్ నేత ఎంపికైన నాటి నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పలుమార్లు డీసీసీ అధ్యక్షుడిగా కూడా తనను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ బహిరంగంగానే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే పరిస్థితి నెలకొంది. పెద్దల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగినా చాప కింద నీరులా విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడి బర్త్డే సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి ఫొటో లేకుండానే పున్న కైలాస్ అనుచరులు ఫెక్ల్సీలు ఏర్పాటు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చించివేయడంతో వారి మధ్య ఉన్న వైరం మరోసారి బహిర్గతమైంది.
డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన నాటి నుంచి..
డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాస్ నేత ఎన్నికైన నాటి నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనను వ్యతిరేకిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తనను తీవ్ర పదజాలంతో దూషించాడని, కైలాస్ నేతను తొలగించాలని సీఎంకు లేఖ కూడా రాశారు. అయినప్పటికీ కైలాస్ నేత తనను ఆశీర్వదించాలని మంత్రి కోమటిరెడ్డి ఇంటికి వెళ్తే పట్టించుకోకుండా పంపించి వేశారని సమాచారం. నాటి నుంచి నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా కైలాస్ నేతకు ఆహ్వా నం అందడం లేదు.
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నల్లగొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాంటి సమయంలో కూడా డీసీసీ అధ్యక్షుడికి కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. జిల్లాలోని ఐదుగురు శాసనసభ్యులతో సత్సంబంధాలు కలిగి ఉన్న కైలాస్ నేతకు, మంత్రి కోమటిరెడ్డితో వైరం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కైలాస్ నేత కూడా నల్గొండ నియోజకవర్గంలో మంత్రితో సంబంధం లేకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఫ్లెక్సీల చించివేత..
పున్న కైలాష్ నేత పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో మంత్రి కోమటిరెడ్డి ఫొటో మినహాయించి జిల్లా, రాష్ట్ర నాయకులు అందరి ఫొటోలు ఉన్నాయి. దీంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో మరోసారి మంత్రి కోమటిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత మధ్య ఉన్న వైరం బహిర్గతమైంది. ఫ్లెక్సీలను చించి వేయాల్సిన అవసరం కోమటిరెడ్డి అనుచరులకు తప్ప మరొకరికి అవసరం ఉండదనే చర్చ పట్టణంలో జరుగుతున్నది.