నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లాలో పక్షం రోజులుగా రైతులు ఇండ్లు, పొలం పనులు వదిలి ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నా జిల్లాకు చెందిన ఇద్దరు మం త్రులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులెదుర్కుంటున్న సమస్యలపై తక్షణమే స్పందించాల్సిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి రైతులంటే చిన్నచూపు. అధికారంలోకి రాకముందే ఇష్టారాజ్యంగా మాట్లాడిన వీరు, ఇప్పుడు జిల్లా రైతులంటే అంటరాని వారన్నట్లుగా పరిస్థితి ఉంది. యూరియా కొరతతో ప్రతి మండలంలో వందలాది మం ది రైతులు నిత్యం రోడ్లపైకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మాకేం సంబంధం అన్నట్లు మంత్రుల వ్యవహారశైలి ఉంది. పైగా అదో సమస్యే కాదన్నట్లు మంత్రుల షెడ్యూల్ కొనసాగుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. మంగళవారం రోజంతా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించారు. క్లాక్ టవర్లోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. అందులో స్థానిక ఎన్నికలు తదితర అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ జిల్లా అంతటా రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై సమీక్షించేందుకు మాత్రం మంత్రికి మనసు రాలేదని ఆ పార్టీకి చెందిన రైతు నేతలే పెదవి విరుస్తుండటం గమనార్హం.
వినాయక చవితి ముందు రోజు కూడా మహిళలు, పురుషులు రోజంతా యూరియా కోసం పడిగాపులు పడ్డారు. త్రిపురారంలో ఉదయం ఏడు గంటలకే వందలాది మంది రైతులు బారులుదీరారు. నిడమనూరు పీఏసీఎస్ వద్ద భారీ క్యూలైన్ కనిపించింది. నార్కట్‌పల్లిలో పీఏసీఎస్ వద్ద బారులుదీరిన రైతులకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లిం గయ్య సంఘీభావం ప్రకటిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిరేకల్‌లో రైతులు యూరియా కోసం పడిగాపులు పడ్డారు. వేములపల్లి మండలం సల్కనూర్ పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం ఆందోళన చేశారు. నల్లగొండ జేడీఏ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌లో సహకార సంఘం వద్ద ఉదయం 6 గంటల నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరారు. చెప్పు లు, ఆధార్ కార్డులు క్యూలైన్లలో పెట్టి ఎదురు చూశారు. మేళ్లచెర్వులో హుజూర్నగర్ రూరల్ లింగగిరిలో, కోదాడ మండలం తొగర్రాయిలోనూ రైతులు యూరియా కోసం తిప్పలు పడ్డారు. దాదాపు పక్షం రోజులుగా ఉమ్మడి జిల్లా లో నిత్యం యూరియా కోసం తిప్పలు పడుతూనే ఉన్నా రు. కేసీఆర్ ఉండగా పదేండ్లల్లో ఎన్నడూ యూరియా కోసం క్యూలైన్లు కట్టిన దాఖాలాలు లేవని, కాంగ్రెస్‌తో మళ్లీ క్యూలైన్లు, పోలీసు బందోబస్తు తప్పడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
జిల్లాలో యూరియా కొరత తలెత్తిన నాటి నుంచి నేటికీ మంత్రి కోమటిరెడ్డి పలు దఫాలుగా జిల్లా కేంద్రంలో పర్యటించారు. కానీ ఏనాడూ యూరియా కొరతపై ఆరా తీసిన దాఖలాలు లేవు. కలెక్టర్, వ్యవసాయ అధికారులతో కనీసం చర్చించిన ఆనవాళ్లు కూడా లేవు. ఒకవేళ చర్చిస్తే మంత్రి తరఫున లేదా జిల్లా అధికారుల తరఫున అధికారిక ప్రకటనలు కూడా కనిపించలేదు. కోమటిరెడ్డితోపాటు మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా కనీసం దృష్టి సారించిన దాఖలాలు లేవు. కోమటిరెడ్డి నియోజకవర్గం నల్లగొండలో, ఉత్తమ్ నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా మంత్రులు పట్టించుకోలేదు. మంగళవారం మంత్రి కోమటిరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఎన్నికలపై పార్టీ నేతలతో కసరత్తు చేసినట్లు తెలిసింది. తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేశారు. కానీ యూరియాపై మాత్రం కనీస సమీక్ష చేసే తీరిక మంత్రికి లేకపోయింది. అధికారులతో కనీసం ఫోన్లోనైనా చర్చించే ఆలోచన కూడా చేయలేదు. దీంతో మంత్రిపై నల్లగొండలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా మంత్రి రైతు సమస్యలను ఎందుకు పట్టించుకోవడంలేదంటూ చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేకపోవడం శోచనీయమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాల్లోకి వస్తే కాంగ్రెస్ నేతలకు తగిన బుద్ధి చెప్పాలన్న చర్చ సాగుతోంది. మరోవైపు మంగళవారం నాటికి జిల్లాకు 49 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో 21వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. కానీ మంత్రులు దృష్టి పెట్టకపోవడంతో అరకొరగానే యూరియా సరఫరా జరుగుతోంది. అదును దాటిన తరవాత యూరియా వస్తే ఏం చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తుండటం గమనార్హం.