‘ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం కంటి వెలుగు. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. మొదటి విడుత వచ్చిన సత్ఫలితాలతో రాష్టంలో చూపు సమస్య ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించడం కోసం రెండో విడుతకు శ్రీకారం చుట్టడం జరుగుతున్నది. ఖమ్మంలో మూడు రాష్ర్టాల సీఎంలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగును ప్రారంభిస్తారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో వంద రోజుల కార్యాచరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సూర్యాపేటలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన కంటి వెలుగు అవగాహన ర్యాలీని మినీ ట్యాంక్ బండ్ వద్ద మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ అనేక మంది చూపు కోల్పోతున్నారని, అలాంటి వారంతా కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్యాంపులు, ప్రత్యేక బృందాలు, సిబ్బంది నియామకంతో పకడ్బందీ కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. పరీక్షలు నిర్వహించి సమస్యను బట్టి అక్కడే మందులు, కళ్లద్దాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
సూర్యాపేట టౌన్, జనవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం కంటి వెలుగు కార్యక్రమమని, దేశంలో ఇంటువంటి కార్యక్రమం మరెక్కడా లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కంటివెలుగుపై వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన అవగాహన ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని అన్ని రంగాల వారు భాగాస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మనిషికి కన్ను ప్రధానమైనదని, అది లేకుంటే అంధకారమేనని, పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి కంటి చూపు తెప్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చారని అన్నారు.
చాలామంది చూపు తక్కువైందని తెలిసికూడా ఆర్థిక ఇబ్బందులతో ఆస్పత్రికి వెళ్లడం లేదని, అలాంటి వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. నేడు ఖమ్మంలో ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతో కలిసి మన సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్టణంలోని లయన్స్ క్లబ్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించగా వాటినికూడా మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, డీఎంహెచ్ఓ కోటాచలం, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీటీసీ జీడి భిక్షం, గుడిపూడి వెంకటేశ్వరరావు, బండారు రాజా, మాండన్ సుదర్శన్, భూతరాజు సైదులు, భాస్కర్ పాల్గొన్నారు.