సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్నదని, తొమ్మిదేండ్లలో జిల్లా కేంద్రం రూపురేఖలు మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నూతనంగా నిర్మించిన జిల్లా కార్యాయాలు ప్రగతికి చిహ్నాలుగా నిలువనున్నాయని తెలిపారు. జిల్లాకేంద్రంలో తుది దశ నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయాన్ని మంత్రి సందర్శించారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అనంతరం నల్లగొండలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఇదే నమూనాతో సూర్యాపేటలోనూ నిర్మించాలని సంబంధిత కాంట్రాక్టర్లకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సూర్యాపేటలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు రాష్ర్టానికే ఆదర్శంగా నిలువనున్నాయన్నారు. ఈ నెల 24న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జిల్లా కార్యాలయాలు ప్రారంభోత్సవం కానుండడంతో మరింత శోభ సంతరించుకోనున్నాయని తెలిపారు.
– నల్లగొండ/సూర్యాపేట టౌన్, జూలై 10
సూర్యాపేట టౌన్, జూలై 10 : సీఎం కేసీఆర్ ప్రసాదించిన సూర్యాపేట జిల్లా ఆయన నాయకత్వంలో గత తొమ్మిదేండ్లుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ఇప్పటి వరకు తాత్కాలిక భవనాల్లో పాలన కొనసాగగా, ఈ నెల 24 నుంచి నూతనంగా అందుబాటులోకి రానున్న జిల్లా కార్యాలయాలు సూర్యాపేట అభివృద్ధికి చిహ్నాలుగా నిలిచిపోనున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో నిర్మాణమవుతున్న బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం చివరి దశ ఏర్పాట్లను సోమవారం ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలనే సంకల్పంతో 2014కు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ప్రసాదించిన సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారి నలుదిక్కులా సరికొత్త అందాలతో యావత్ రాష్ర్టానికే ఆదర్శంగా రూపుదిద్దుకుంటుందన్నారు.
ఒక వైపు కలెక్టరేట్, మరో వైపు ఎస్పీ కార్యాలయం, జాతీయ రహదారి సమీపంలో అద్భుతంగా రూపుదిద్దుకున్న సంచలనాత్మకమైన మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ మార్కెట్, గిరిజన గురుకుల పాఠశాల, పార్క్‌ను తలపించేలా మహాప్రస్తానం, రెండు మినీ ట్యాంక్బండ్లు, రోడ్ల విస్తరణతో విస్తారంగా మారిన ప్రధాన వీధులు, మినీ ట్యాంక్‌బండ్‌లో బోటింగ్, అహ్లాదకరంగా పార్క్‌లు, వాడవాడలా పచ్చదనం సంతరించుకున్న హరితహారం మొక్కలు, వెలుగుల జిలుగు సెంట్రల్ లైటింగ్‌తో సూర్యాపేట మరింత సుందరంగా రూపుదిద్దుకుందన్నారు. ఇంతటి ప్రగతి సాధించిన జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించుకున్న జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ మార్కెట్, ఎస్టీపీ, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ఈ నెల 24న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవంతో సూర్యాపేట మరింత శోభను సంతరించుకోనున్నదన్నారు. రాబోయే రోజుల్లోనూ ఐక్యతతో మరింత అభివృద్ధితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీఎస్పీ నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, జూలకంటి జీవన్‌రెడ్డి, మారిపెద్డి శ్రీనివాస్‌గౌడ్, కక్కిరేణి నాగయ్యగౌడ్, జడ్పీటీసీ సంజీవ్‌నాయక్ పాల్గొన్నారు.
నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయం పరిశీలన
నల్లగొండ : జిల్లా కేంద్రంలో సర్వాంగ సుందరంగా ముస్తాబైన బీఆర్ఎస్ కార్యాలయాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితోపాటు తుంగతుర్తి, హుజూర్నగర్ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీటింగ్ హాల్‌తోపాటు గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌ను కలియతిరిగి పరిశీలించారు. వారి వెంట నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, పూజిత శ్రీనివాస్ ఉన్నారు.