దేశంలో ఆకలి, దారిద్య్రం లేని రాష్ట్రం తెలంగాణ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండేటి ఏడుకొండలుతోపాటు ఆ పార్టీకి చెందిన సుమారు 200 మంది శుక్రవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. దేశంలో ఇంటింటికీ తాగు నీరు, 24గంటల కరంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇప్పటికీ చాలా గ్రామాల్లో కరంట్ లైన్లు కూడా లేవన్నారు. మన రాష్ట్రంలో రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు వివిధ వర్గాలకు పింఛన్లు ఇస్తుంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆరు వందలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. సూర్యాపేటను నంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దే యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలని కోరారు. కాగా కొండేటి ఏడుకొండలుతోపాటు మరికొందరి చేరికతో బీజేపీకి భారీ షాక్ తగిలినట్లయ్యింది.
– సూర్యాపేట టౌన్, జూన్ 23
సూర్యాపేటటౌన్, జూన్ 23 : దేశంలో ఆకలి, దారుద్య్రాలు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.. సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 8వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, పట్టణ మాజీ అధ్యక్షుడు కొండేటి ఏడుకొండలు శుక్రవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనతో పాటు మరి కొందరికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 30 శాతం మంది ప్రజలు ఒక్క పూట భోజనం తింటూ మిగతా పూటలు పస్తులుంటున్నారన్నారు. కానీ తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆకలి దారిద్య్రాలు లేకుండా చేసిందన్నారు. దేశంలో ఇంటింటికీ 24 గంటల కరెంట్, తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోని చాలా గ్రామాల్లో ఇప్పటికీ కరెంట్ లైన్లు కూడా లేవన్నారు. దేశ వ్యాప్తంగా అత్యధికంగా 45 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నది మన రాష్ట్రంలోనే అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో సైతం 40 వేల మందికి పింఛన్ అందజేస్తున్నామన్నారు.
మన రాష్ర్టాంలో వృద్ధులకు రూ. 2వేలు, వితంతువులకు రూ. 3వేలు, వికలాంగులకు రూ. 4వేల పెన్షన్ ఇస్తుండగా ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కేవలం ఆరు వందల పింఛన్ మాత్రమే ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రజల కోసం పని చేస్తున్న ఎమ్మెల్యేలు కేవలం బీఆర్ఎస్ పార్టీ వారే అన్నారు. సూర్యాపేటలో 2014కు ముందు వేసిన ఓటు ద్వారా ప్రజలకు ఒరిగిందేమి లేదని.. 2014లో కారు గుర్తుకు వేసిన ఓటు సూర్యాపేట ప్రజలను మూసీ మురికి నుంచి విముక్తి కల్పించిందన్నారు. మెడికల్ కళాశాల, మినీ ట్యాంక్బండ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు వేసిన ఓటు ద్వారానే వచ్చాయన్నారు. మూసీ ప్రాజెక్టు గేట్లు శిథిలావస్థకు చేరి నీరు వృథాగా పోతున్నా సమక్య పాలకులు పట్టించుకోలేదన్నారు. తాను గెలిచిన మరుక్షణమే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి గేట్లను ఆధునీకరించినట్లు మంత్రి చెప్పారు. దాంతో 30వేల ఎకరాల్లో వెయ్యి కోట్ల విలువ చేసే పంటలు పండించారని అన్నారు.
సూర్యాపేట సుందరీకరణలో ఇంకా చేయాల్సింది చాలా ఉందని, దేశంలోనే నంబర్‌వన్ పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దే యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకొన్నది బీఆర్ఎస్ పార్టే అన్నారు. దశాబ్ద్దాలుగా కాంగ్రెస్, బీజేపీలు చేయలేని అభివృద్ధిని తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. సూర్యాపేట అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు బీఆర్ఎస్లో చేరిన ఏడుకొండలు, మహిళా మోర్చా నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో పాల్వాయి వెంకన్న, శైలజ, పాపారావు, అశోక్, లక్ష్మయ్య, చారి, నిర్మల, శ్రీరాములు, సైదాతో పాటు 200 మంది బీజేపీ, మహిళా మోర్చ నాయకులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, పెద్దగట్టు మాజీ చైర్మన్ కడారి సతీశ్‌యాదవ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు, కౌన్సిలర్లు చింతలపాటి భరత్ మహజన్, బత్తుల జాని, రాపర్తి శ్రీనివాస్, జానీభాయ్, లింగారెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ కార్యకర్తకు మంత్రి సాయం
పెన్‌పహాడ్ : ఆర్థిక నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ కార్యకర్త తనకు జరిగిన నష్టాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డికి వివరించగా రాజకీయాలను పక్కన పెట్టి అతడికి ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మాచారం గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త చిత్రం శ్రీకాంత్ గేదెలు కొనుగోలు చేశాడు. వాటి ద్వారా నష్టం రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో ఇటీవల విషయాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డికి వివరించాడు. దాంతో స్పందించిన మంత్రి తన సొంతంగా రూ. లక్ష అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం మాచారం గ్రామానికి వెళ్లిన మంత్రి గేదెలను కొనుగోలు చేసేందుకు శ్రీకాంత్‌కు రూ.లక్ష సాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తన ఆర్థిక పరిస్థితిని వివరించగానే రాజకీయాలను పక్కన బెట్టి ఆర్థిక సాయం అందించారని, అందుకు మంత్రికి కృతజ్ఙతలు తెలిపారు. చీదెళ్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బాల వెంకన్న అనారోగ్యంతో బాధపడుతుండగా మంత్రి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. అనంతారం గ్రామానికి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మామిడి వెంకటయ్య తల్లి సైదమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మంత్రి వారి ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వెంట ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, జడ్పీ వైస్‌చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగంధర్, సర్పంచులు సీతారాంరెడ్డి, బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, చెన్నూ శ్రీనివాస్‌రెడ్డి, బొలక సైదమ్మాబొబ్బయ్య, ఎంపీటీసీలు వెంకటరెడ్డి, మామిడి రేవతి పరంధాములు, సింగిల్‌విండో చైర్మన్లు ఉన్నారు.