రామగిరి, మార్చి 4 : సాహిత్యంతో పాటు ప్రపంచానికి నాగరికత అంటే ఏంటో తెలిపింది భారతీయ విలువలేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పానగల్‌లోని వేద పాఠశాల ఆవరణలో తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం, మతైక అర్చక ఉద్యోగ సంఘం, ‘ధూప, దీప నైవేద్య అర్చక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పంచాగ ఆవిష్కరణ, బ్రాహ్మణ నేత దివంగత గంగు భానుమూర్తి విగ్రహ ఆవిష్కరణ, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ సభ్యుడు, ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలచారి ఆత్మీయ సన్మానోత్సవం, టీటీడీ వేద పాఠశాలకు స్థలం కేటాయింపు ఉత్వర్వుల అందజేత కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే కాలం, పద్ధతులు, విషయాలను శాస్త్రీయంగా చెప్పడంలో పంచాంగం కీలకమైందన్నారు. తల్లిదండ్రులను, గురువులకు గౌరవించే లక్షణం మన సమాజంలో ఉన్నంత మరెక్కడా లేదని పేర్కొన్నారు. అందుకే భారతీయ సమాజం బలంగా ఉందన్నారు. వీటన్నింటినీ నేర్చుకునేందుకు ప్రపంచం మన వైపు చూస్తున్నదని తెలిపారు. భారతీయ విలువలు ఎవరో పుట్టిస్తే రాలేదని, సమాజ పరిణామ క్రమంలో వేల సంవత్సరాల పరిశోధన, అభివృద్ధిలో వచ్చినవేనని పేర్కొన్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మే విధంగా కొందరు వ్యహరిస్తున్నారని విమర్శించారు. విలువల పరిరక్షణలో బ్రాహ్మణ సమాజం చేస్తున్న కృషి ఎంతో ఉందని అభివర్ణించారు. వేద పాఠశాలకు నూతన భవనం నిర్మించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా బ్రాహ్మణ భవనానికి సైతం 20గుంటలు, బ్రాహ్మణ అపరకర్మలకు 5గుంటల స్థలాన్ని పానగల్లో వేదపాఠశాల సమీపంలో కేటాస్తామని నిధులు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ నీటి పారుదల శాఖ చైర్మన్, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి మాట్లాడుతూ సమాజంలో సర్వేజన సుఖినోభవంతు అని ఆశీర్వచనం చేసే బ్రాహ్మణులంతా తమ శ్రేయస్సుకు సైతం ఆలోచించాలని సూచించారు. బ్రాహ్మణులంతా ఆత్మన్యూనతా భావం వీడి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని కులాల మాదిరిగానే బ్రాహ్మణుల పిల్లల విదేశీ విద్యకు ప్రభుత్వం రూ.20లక్షలు అందిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 743మంది పిల్లలకు బ్రాహ్మణ పరిషత్ ద్వారా లబ్ధి అందించారని గుర్తుచేశారు. అంతా ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని సూచించారు. త్వరలోనే హైదరాబాద్‌లో బ్రాహ్మణ భవనం ప్రారంభోత్సవం ఉంటుందని, కార్యక్రమానికి బ్రాహ్మణులంతా తరలివచ్చి సీఎం కేసీఆర్ సంకల్పానికి బలం కలిగించాలన్నారు. నల్లగొండలో బ్రాహ్మణ భవనం నిర్మాణానికి నిధుల కేటాయింపునకు హామీనిచ్చారు. బ్రాహ్మణ నేత గంగు భానుమూర్తి విగ్రహం ఏర్పాటును అభినందించారు. అనంతరం బ్రాహ్మణుల ఆధ్వర్యంలో సముద్రాల వేణుగోపాలాచారికి నిర్వహించిన ఆత్మీయ సన్మానోత్సవాన్ని వేదపాఠశాల విద్యార్థులు, బ్రాహ్మణుల వేద మంత్రోచ్ఛారణలతో మంత్రి, ఎమ్మెల్యేల ద్వారా ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా మంత్రి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను సైతం ఘనంగా సన్మానించారు. సభలో చిన్నారి లక్ష్మీసుజిత చేసిన శాస్త్రీయ నృత్యం ఆకట్టుకుంది. ధూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తాసీల్దార్ మందడి నాగార్జున్‌రెడ్డి, డీడీఎన్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, చెర్వుగట్టు ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, తెలంగాణ మతైక ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాగోజు మల్లాచారి, రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణశర్మ, అఖిల బ్రాహ్మ ణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్‌రావు, వైదిక బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు గూదె లక్ష్మీనర్సయ్యశర్మ, డీడీఎన్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ శర్మ, వెంకట్రామశర్మ పాల్గొన్నారు.
బ్రాహ్మణ అపరకర్మలకు అందించే స్థలం పరిశీలన
అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా వేణుగోపాల్‌రావు ఆధ్వర్యంలో బ్రాహ్మణ అపర కర్మలకు ప్రత్యేక స్థలం కావాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని కోరారు. దీంతో ఆయన వారితో కలిసి పానగల్ వేదపాఠశాల సమీపంలో అందించే స్థలాన్ని పరిశీలించారు. స్థలం చదును చేసే విషయంలో పలు సూచనలు చేశారు.