మన సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది ప్రతీక బతుకమ్మ పండుగ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి మనదని, అటువంటి సంస్కృతి నేడు ఖండాతరాలకు విస్తరించిందని తెలిపారు. బతుకమ్మ సంబురాలు నేడు విశ్వవ్యాప్తంగా జరుపుకుంటున్నారంటే ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. సూర్యాపేటలోని నివాసంలో తన సతీమణి సునీతతో కలిసి మంత్రి బతుకమ్మను పేర్చారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలకు ఎంగిలిపువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. దేవీ శరన్నవరాత్రోవాలను కూడా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.
– సూర్యాపేట టౌన్, అక్టోబర్ 14
సూర్యాపేట టౌన్, అక్టోబర్ 14 : మన సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు బతుకమ్మ పండుగ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి మనదని, అటువంటి సంస్కృతి నేడు ఖండాంతరాలకు విస్తరించిందని పేర్కొన్నారు. తెలంగాణ బతుకమ్మ సంబురాలు నేడు విశ్వవ్యాప్తంగా సంబురంగా జరుపుకొంటున్నారంటే ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతున్నదని కొనియాడారు. సూర్యాపేటలోని మంత్రి నివాసంలో శనివాసం ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సతీమణి గుంటకండ్ల సునీత మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చారు. ఈ వేడుకల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని కాసేపు బతుకమ్మను పేర్చి సందడి చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అనేక జాతులు ఉన్నా.. ప్రకృతిని ఆరాధించే ఏకైక జాతి తెలంగాణ అన్నారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో కొంత నిరాదరణకు గురైన బతుకమ్మ పండుగను ఇంటింటికీ చేర్చిన ఘనత తెలంగాణ ఉద్యమానిదని తెలిపారు. రాష్ట్ర సాధనలో ప్రజలను ఏకం చేయడంలో బతుకమ్మ పండుగ ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో వైభవోపేతంగా తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో సూర్యాపేటకు ప్రత్యేక స్థానం ఉన్నదని చెప్పారు. సద్దుల చెరువు ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించే వేడుకల్లో వేలాది మంది మహిళలు పాల్గొంటారని తెలిపారు. ఆడబిడ్డలు అంతా ఒకచోట చేరి సంప్రదాయం ఉట్టిపడేలా, ఊరంతా ఒక్కటై జరుపుకొనే పండుగ బతుకమ్మ అన్నారు. ఉయ్యాల పాటల్లో మహిళల కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తాయని పేర్కొన్నారు.
ఈ పాటలు చాలా వినసొంపుగా, ఉత్సాహాన్ని పెంపొందించేలా ఉంటాయని చెప్పారు. తెలంగాణ అస్థిత్వం బతుకమ్మలో ఉన్నదని.. అందుకే బతుకమ్మ అంటే ప్రకృతి, పూల పండుగ, మనిషి ప్రకృతితో మమేకమయ్యే అద్భుతమైన వేడుక అని అన్నారు. స్వరాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పర్వదినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ కానుకగా మహిళలకు చీరెలు పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. మహిళల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న ఆదరాభిమానాలకు ఇది చక్కటి ఉదాహరణగా మంత్రి పేర్కొన్నారు. శనివారం పెత్ర అమావాస్యతో మొదలయ్యే బతుకమ్మ ఉత్సవాలతోపాటు దేవీ శరన్నవరాత్రోత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కౌన్సిలర్లు నిమ్మల స్రవంతి, గండూరి పావని, బత్తుల లక్ష్మి, వల్దాస్ సౌమ్య, జాటోతు లక్ష్మి, మహిళా నాయకులు పాల్గొని బతుకమ్మలు పేర్చారు.