సూర్యాపేట, జులై 28 : అల్పపీడనంతో మూడ్రోజులపాటు కురిసిన వర్షం అరు మండలాలను అతలాకుతలం చేసింది. తుంగతుర్తి నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో జిల్లాలోనే రికార్డు స్థాయి వర్షం కురిసింది. మూడ్రోజుల్లో 1,314.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగటున మండలానికి 219.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు లెక్క. అత్యధికంగా తిరుమలగిరి మండలంలో 283.2 మి.మీ. వర్షం కురిసింది. భారీ వర్షాలతో ఆరు మండలాల పరిధిలోని చెరువులు, కుంటలు నిండి అలుగులు పోస్తున్నాయి. ఈ మండలాల్లో జూన్ నెలలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ పడగా.. ఇప్పుడు జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైన మండలాలుగా అగ్ర స్థానంలో నిలిచాయి. నియోజకవర్గం పరిధిలో 416 చెరువులు ఉండగా.. 390 చెరువులు అలుగులు పోస్తున్నాయి. మరో 26 చెరువులు 75 శాతం నుంచి 100 శాతం వరకు నిండాయి.
సమైక్య రాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గం అంటే వెనుకబడిన ప్రాంతంగా పేరుండేది. ఈ ప్రాంతం వెనుకపడలేదు.. అభివృద్ధ్ది చేయకుండా వెనుకకు నెట్టారని స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిరూపించారు.
కాళేశ్వరం జలాలతో తిరుమలగిరి మండలంలో 32 మీటర్ల లోతులో ఉండే భూగర్భ జలాలు 3మీటర్ల లోతులోకి వచ్చాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ప్రణాళికాబద్ధంగా కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి చెరువులు నింపి భూగర్భ జలాలు పెంచారు. దీంతో బోరుబావులు పుష్కలంగా పోయడం, చెరువులు జలకళను సంతరించుకోవడం, దశల వారీగా శ్రీరాంసాగర్ కాల్వలో కాళేశ్వరం జలాలు రావడంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. వర్షాలకే నోచుకోని ఈ ప్రాంతం భారీ వర్షాలు పడే విధంగా వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా తుంగతుర్తి నియోజకవర్గం నిలిచింది. ఇటీవల అల్పపీడన ద్రోణితో వర్షాలు కురువగా తుంగతుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. మూడు రోజుల్లోనే 1,314.7 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. దీంతో ఆ ప్రాంతంలోని చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. ఎక్కడ చూసినా జల సవ్వడులే. కాళేశ్వరం జలాలు రాకముందే నియోజకవర్గంలో చెరువులు నిండడం విశేషం.
ముమ్మరంగా వ్యవసాయ పనులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. అత్యధికంగా పత్తి సాగు చేసే ఇక్కడి రైతులు నీళ్లు పుష్కలంగా ఉండడంతో వరి పంట వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు అత్యధికంగా వరి సాగు చేస్తున్నారు. ఆరు మండలాల పరిధిలో 416 చిన్న, పెద్ద చెరువులు ఉండగా.. ఇందులో 390 చెరువులు పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. మరో 26 చెరువులు 95 శాతం మేర నిండాయి. దీంతో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు.