రామగిరి, డిసెంబర్ 29 : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా అందించాలని, విద్యా రంగం బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. రెండో రోజు టీఎస్ యూటీఎఫ్ మహాసభలో భాగంగా ఆదివారం సభా వేదిక వద్ద ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు 15శాతం, కేంద్రం 5-6శాతం నిధులు కేటాయించాలన్నారు. గురుకులాలకు సైతం కేంద్రం 25శాతం నిధులు ఇవ్వాలన్నారు. ప్రాథమిక విద్యకు ఇచ్చే అరకొర నిధులు సరిపోవడం లేదని తెలిపారు.
అమెరికా దేశాల్లో మాదిరిగా అందరికీ నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించాలని డిమాండ్ చేశారు. బడికి సమాజాన్ని అనుసంధానం చేయాలని చర్చిస్తున్నామని, అందరి సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్య పటిష్టం జరుగాలని కోరారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య మాట్లాడుతూ విద్యా రంగ సమస్యలు పెరిపోతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా శాఖలో ఖాళీలను తక్షణమే భర్తీచేసి, ఇన్చార్జీల పాలనకు స్వస్తి పలుకాలని కోరారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, ఇతర అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో తాత్కాలిక, కాంట్రాక్టు, పార్ట్‌టైం అనే బోధన వ్యవస్థ లేకుండా అందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
కరిక్యులమ్‌తోపాటు కో కరిక్యులమ్ అంశాలు ఎలా ఉండాలనే దానిపై పలు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ 2009లో వచ్చిన విద్యాహక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కేంద్రం నో డిటెన్షన్ పాలసీ రద్దు చేయడం సరింది కాదని తెలిపారు. గతంలో నో డిటెన్షన్ అంశం తెరపైకి వస్తే నాటి సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా నో డిటెన్షన్ రద్దును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఎన్ఈపీ -2020తో విద్య మరింత వ్యాపారం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూ. 8లక్షలకు, సేవింగ్స్ మినహాయింపు రూ. 5లక్షలకు పెంచాలన్నారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరించారు.
మోదీ పాలనలో పేదలకు చేసింది శూన్యం : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య
కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని మోదీ సర్కారు పేదలకు, విద్యకు చేసింది శూన్యమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వీరయ్య అన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు వనరులు లేవని తప్పుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య కేవలం ఉపాధ్యాయులది మాత్రమేనని, తమ బాధ్యత కాదని ఉపాధ్యాయులని దోషులుగా నిలబెడుతున్నాయని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించకుండా తప్పించుకుంటున్నాయని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించకుంటే పిల్లలు ఎలా చేరుతారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలపై జిల్లాల వారీగా చర్చలు, ప్రగతి నివేదికలను ప్రవేశపెట్టి చర్చించారు. వీటిపై సోమవారం తీర్మానాలు చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.రాములు, కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, నాగమణి, జ్ఞానమంజరి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బక్కా శ్రీనివాసాచారి, పెరుమాళ్ల వెంకటేశం, కోశాధికారి నర్ర శేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, నలపరాజు వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షురాలు బడుగు అరుణ, ఆహ్వానం సంఘం ఉపాధ్యక్షుడు ఎడ్ల సైదులు, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ యాకయ్య, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులుగా హాజరైన నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.