రామగిరి, జూలై 25 : మహాత్మాగాంధీ యూనివర్సిటీతో పాటు అనుబంధంగా ఉన్న కళాశాలలోని విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో సత్తా చాటేలా వారిని తీర్చిదిద్దాలని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ 2025 -2026 విద్యా సంవత్సరం క్రీడా ప్రణాళిక ఆమోదం- సమీక్ష సమావేశం శుక్రవారం వర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించారు. సమావేశానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసినట్లు, వాటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నారు.
సమావేశంలో అంతర కళాశాల క్రీడా పోటీల నిర్వహణ, క్రీడాంశాల ఆమోదం, కోచింగ్ క్యాంపుల నిర్వహణ, కొత్త క్రీడాంశాలను ప్రవేశపెట్టడం, అంతర్ కళాశాలలు, అంతర విశ్వవిద్యాలయ క్రీడా పోటీల్లో విద్యార్థుల ఎంపికలు, కోచింగ్ క్యాంపుల నిర్వహణకు బడ్జెట్ ఆమోదం, కోచింగ్ క్యాంపులకు అభ్యర్థుల ఎంపిక విధానాల రూపకల్పన వంటి అంశాలపై చర్చించి ఒక్కొక్కటిగా ఆమోదించారు. గతంలో నిర్వహించిన 35 క్రీడాంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ దఫా నైపుణ్యాలు గల విద్యార్థులను ఎంపిక చేయాలని సూచించారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డాక్టర్ హరీశ్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలలు విధిగా క్రీడా సదుపాయాలను కల్పించాలన్నారు. 22 ఆగస్టు, 2025 నుండి మొదలయ్యే అంతర కళాశాల క్రీడా పోటీలు నవంబర్ 22, 2025 వరకు వివిధ అంశాలలో నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, ఫిజికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ రాజేశ్ కుమార్, స్పోర్ట్స్ బోర్డ్ కో ఆర్డినేటర్ శివ శంకర్, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ వై.శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ఆర్.మురళి, స్పోర్ట్స్ బోర్డ్ సభ్యులు డా.శ్రీదేవి, డా.కె ప్రేమ్‌సాగర్, డా.మిర్యాల రమేశ్, ఫ్రాన్సిస్ వివిధ కళాశాల పీడీలు పాల్గొన్నారు.