రామగిరి, డిసెంబర్ 26 : యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని, సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ పొందుపర్చారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా అమలుకు నోచుకోవడం లేదు. మూడు నెలల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. దాంతో మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే దశల వారీగా నిరసనలు చేపడుతామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని విద్యా శాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు ఒకవైపు, మరోవైపు మోడల్ స్కూల్ టీచర్లు నిరసన దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే.
ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని వర్సిటీలోని కాంట్రాక్టు అధ్యాపకులు దాదాపు 350 మందిపైగా ఈ ఏడాది సెప్టెంబర్ 13న ప్రగతి భవన్‌కు వెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. దీంతో ఆయన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, అధ్యాపకులతో చర్చలు జరిపి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ నాలుగు నెలలు కావస్తున్నా అది కూడా కార్యరూపం దాల్చలేదు. దాంతో ప్రభుత్వ తీరుపై కాంట్రాక్టు అధ్యాపకులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిసి సమ్మె నోటీసు అందించేందుకు సమాయత్తమవుతన్నట్లు సమాచారం.
యూజీసీ నిబంధనల మేరకు ఎంజీయూలో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. దీంతో న్యాక్ గుర్తింపులో వర్సిటీ ఉన్నతమైన గ్రేడ్ కోల్పోవాల్సి వస్తున్నది. న్యాక్ హోదా ప్రకారమే ఎంజీయూకు కేంద్ర సంస్థల నుంచి నిధులు అందుతాయి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్య పరిష్కరిస్తే యూనివర్సిటీ ముందుకు సాగుతుంది.
ఎంజీయూ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇంజినీరింగ్ కళాశాలలోని 21 డిపార్టుమెంట్లలో 32మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. మిగిలిన 51మంది కాంట్రాక్టు అధ్యాపకులే బోధన సాగిస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలో ఎక్కువ భాగం కాంట్రాక్టు అధ్యాపకులే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతుండటంతో ఎంజీయూలోనూ బోధన పూర్తిగా స్తంభించే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో రెగ్యులర్ ప్రొఫెసర్స్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎంత మంది పనిచేస్తున్నారనే విషయం వేళ్లమీద లెక్కించవచ్చు. వర్సిటీలో విద్యా బోధన దాదాపుగా ఆయా వర్సిటీల్లో పనిచేస్తున్న 1,456 కాంట్రాక్టు అధ్యాపకులతోనే సాగుతుందనేది వాస్తవం. కొన్ని వర్సిటీల్లో డిపార్టుమెంట్స్ పూర్తి కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడుస్తున్నది. మరో వైపు పరిపాలనా విభాగంలో సైతం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే సింహ భాగంలో ఉన్నారు.
విద్యార్థుల శ్రేయస్సు కోసం రెగ్యూలర్ అధ్యాపకులతో సమానంగా బోధన చేస్తున్నాం. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించడం లేదు. ఎంజీయూ ఇంజినీరింగ్ కళాశాలలో అన్ని విభాగాల్లో అధిక సంఖ్యలో కాంట్రాక్టు అధ్యాపకులే ఉన్నారు. ఇంత వరకు మాకు 7వ పీఆర్సీ అమలు చేయలేదు. ఉద్యోగ భద్రత లేదు. భవిష్యత్ తరాలకు అవసరమై టెక్నాలజీ విద్యార్థులను సమాజానికి అందిస్తున్నా మా జీవితాలు మారడం లేదు. తమ న్యాయమైన సమస్యలపై ప్రభుత్వం ఆలోచింది ఉద్యోగ భద్రత కల్పించాలి.
– జ్యోతిరాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్(సి), డిపార్టుమెంట్ ఆఫ్ సీఎస్ఈ, ఎంజీయూ ఇంజినీరింగ్ కళాశాల
భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉన్నత విద్యానిలయాలు యూనివర్సిటీలు. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉండి ఏండ్ల తరబడి బోధన సాగిస్తున్నాం. తమ సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకొని ఎన్నికల్లో ఇచ్చి హామీలను అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు పీఆర్సీ అమలు చేయాలి.
-రామచంద్రు, అసిస్టెంట్ ప్రొఫెసర్(సి), డిపార్టుమెంట్ ఆఫ్ మ్యాథ్స్, ఎంజీయూ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యూనివర్సిటీలోని కాంట్రాక్టు అధ్యాపకులను శాశ్వత అధ్యాపకులుగా గుర్తిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత సెప్టెంబర్‌లో ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డికి వినతి పత్రం కూడా అందజేశాం. దీనిని సత్వరమే పరిష్కరిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి కూడా ఆదేశిలిచ్చినట్లు సీఎం చెప్పారు. కానీ ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం చేయకపోవడం బాధాకరంగా ఉంది. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా బోధన చేస్తున్న తమ సమస్యలు పరిష్కరించి మా కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నా.
-ఎన్.భిక్షమయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్(సి), డిపార్టుమెంట్ ఆఫ్ ఫిజిక్స్, ఎంజీయూ