రామగిరి, ఆగస్టు 28 : ప్రభుత్వ పాఠశాలలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమర్సీ (ఎఫ్ఎల్ఎన్) అమలులో ఆయా మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులదే కీలక ప్రాత అని, కావునా పట్టిషంగా అమలు చేసి విద్యార్థులందరు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని కలెక్టరేట్లో జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులతో ఉచిత నోటు, పాఠ్య, వర్క్ బుక్స్, యూనిఫామ్స్, ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ హాజరు తదితర అంశాలపై గురువారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నిర్వహించిన బేస్ లైన్ అసెస్మెంట్ ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసన సమార్థ్యాన్ని గుర్తించి రాబోయే డిసెంబర్ నాటికి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచాలని సూచించారు. అదే విధంగా మండల సమీక్ష సమావేశాల నిర్వహణ, కృత్రిమ మేధ ఆధారిత అభ్యసనాన్ని మెరుగుపర్చాలన్నారు. పాఠశాలలో విద్యార్థులు కనీస సామార్థ్యాలు సాధించేలా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలను ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు నిబంధనల మేరకు ఖచ్చితంగా తనిఖీ చేయాలని, ఉపాధ్యాయులు పాఠశాలల్లో పనితీరు, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహణ చేయాలన్నారు.
డీఈఓ బొల్లారం భిక్షపతి మాట్లాడుతూ.. బోధన పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే కొనసాగించాలని, అన్ని స్థాయిల్లో చేయాల్సిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ నాటికి ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు చేసే విధంగా తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రంములో విద్యాశాఖ సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి ఆర్.రామచంద్రయ్య, వీరేంద్ర, రవికుమార్ పాల్గొన్నారు.
Ramagiri : ఎఫ్ఎల్ఎన్ అమలులో ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలదే కీలక పాత్ర : కలెక్టర్ ఇలా త్రిపాఠి