కోదాడ, జూన్ 27 : వర్షాకాలంలో కోదాడ పట్టణ ప్రజలకు వరద ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ ఏర్నేని కుసుమ వెంకటరత్నం బాబు తెలిపారు. శనివారం కోదాడ పట్టణంలోని 34వ వార్డు ఎర్రకుంట వాగులో పూడికతీత, గుర్రపు డెక్క, పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు పనులను ఆమె ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో వాగులో పూడిక, వ్యర్థాల కారణంగా వరద నీరు సాఫీగా ముందుకు సాగక పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే వర్షాలు పడకముందే ముందస్తు చర్యలతో వాగును శుభ్రం చేయిస్తున్నామని వివరించారు. వరద నీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా వెళ్లేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, కౌన్సిలర్ గంధం బాలేంద్ర, పాండు, 33వ వార్డు కౌన్సిలర్ పగిడిపల్లి ఏసు పాదం, డీఈ సాయి లక్ష్మి, తోట శ్రీను, పుల్లయ్య, గోపయ్య, తిరుప్ వార్డు ప్రజలు పాల్గొన్నారు.