రామగిరి, సెప్టెంబర్ 09 : ఆధునిక కంప్యూటర్ సైన్స్‌కు గణితశాస్త్రమే వెన్నెముక అని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఫర్ విమెన్ (A), నల్లగొండ ప్రిన్సిపాల్ ప్రొ.కె.శ్రీనివాస్ రాజు అన్నారు. కళాశాల గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “Mathematics in Computer Science: Applications and Opportunities” అంశంపై బుధవారం ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. డిస్క్రీట్ స్ట్రక్చర్స్, లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ వంటి గణిత భావనలు అల్గారిథమ్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ లావాదేవీలకు కీలకమైనవని వివరించారు. విద్యార్థులు గణితాన్ని కేవలం తరగతి గది పాఠ్యాంశంగా కాకుండా డిజిటల్ ప్రపంచాన్ని నడిపించే శక్తివంతమైన సాధనంగా అర్థం చేసుకోవాలని సూచించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్జీ కళాశాల, నల్లగొండ ప్రిన్సిపాల్ ప్రొ.ఎస్.ఉపేందర్ “అండర్ గ్రాడ్యుయేట్ పూర్తయిన తర్వాత గణితశాస్త్రంలో అవకాశాలు” అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర ఆధునిక రంగాల్లో గణితశాస్త్ర విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇంటర్‌డిసిప్లినరీ అభ్యాసంపై విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు. గణితశాస్త్ర విభాగం కన్వీనర్ డా. టి. శ్రీనివాసులు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడం, పరిశోధన, ఉన్నత విద్య వైపు వారిని ప్రోత్సహించడమే వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నిర్వాహక కార్యదర్శి, అసోసియేట్ ప్రొఫెసర్ డా.ఎ.మల్లేశ్వరి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్, వర్క్‌షాప్ కిట్ల పంపిణీతో పాటు సాంకేతిక కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.
సాంకేతిక సదస్సులో హైదరాబాద్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఒడేలు వంగ రిసోర్స్ పర్సన్‌గా పాల్గొన్నారు. “Mathematics in Computer Science: Applications and Opportunities” అంశంపై సుమారు మూడు గంటల పాటు విద్యార్థినులకు వివరణాత్మక అవగాహన కల్పించారు. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, గ్రాఫ్ థియరీ అల్గారిథమ్ డిజైన్‌లో పోషించే పాత్ర, క్రిప్టోగ్రఫీ, నెట్వర్క్ సెక్యూరిటీలో గణితశాస్త్ర పునాదులు, మెషిన్ లెర్నింగ్‌లో లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ వినియోగం, క్వాంటం కంప్యూటింగ్‌లో గణిత అనువర్తనాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, గణితశాస్త్ర విభాగం అధ్యాపకులు కె. వెంకటేశ్వర్లు, పి. సంతోషి, ఇతర అధ్యాపక సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.