సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 30 : జిల్లా కేంద్రమైన సూర్యాపేట కృష్ణాకాలనీలోని ఓ ఇంట్లో 4 బంగారు బిస్కెట్లు (40 తులాలు), 8 లక్షల నగదు చోరీకి గురైన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని ఈ చోరీ జరగడంతో స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో ఉన్న వృద్ధురాలి వద్ద కేర్ టేకర్‌గా పని చేస్తున్న మహిళపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలలుగా వృద్ధురాలి వద్ద కేర్ టేకర్‌గా పని చేస్తున్న కరిష్మా బేగం అనే మహిళపై అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కరిష్మా బేగంను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. చోరికి సంబంధించి క్లూస్ టీం, డాగ్ స్కాడ్ బృందాలతో పోలీసులు ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కృష్ణా కాలనీలో నివాసం ఉంటున్న వృద్ధురాలు బొబ్బ సువర్చలకు ముగ్గురు కుమారులు.
వారంతా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. కాగా తల్లి సంరక్షణ కోసం వారు ఓ మహిళను ఏర్పాటు చేసి సూర్యాపేటలోని తమ ఇంట్లో ఉంచారు. కాగా ఈనెల 5న బ్యాంకు లాకర్లో తన పేరున ఉన్న 4 బంగారు బిస్కెట్లను వృద్ధురాలు, కేర్ టేకర్ సాయంతో ఇంటికి తీసుకొచ్చి బీరువాలో భద్రపర్చింది. ఈనెల 24న బీరువాలోని బంగారు బిస్కెట్లు కనిపించకపోవడంతో వృద్ధురాలు తన కుమారులకు విష యం చెప్పింది. ఇంటికి వచ్చిన కుమారులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అనుమానితురాలుగా భావిస్తున్న కరిష్మా బేగంను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.