పల్లె నుంచి పట్నం దాకా అద్భుతమైన రోడ్లకు పెట్టింది పేరు తెలంగాణ. సమైక్య
పాలనలో నరకానికి నకళ్లుగా ఉన్న రోడ్లు స్వరాష్ట్రంలో రాచబాటలుగా మారాయి. ఎక్కడో ఒకచోట తండాలు, ఆవాసాల్లో సమస్య ఉండగా, వాటికీ రాష్ట్ర ప్రభుత్వం నూతన రహదారులను మంజూరు చేసింది. వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకూ నిధులు విడుదల చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు 579.58 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అండ్ రూరల్‌డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి.. మూడు, నాలుగు నెలల్లోనే పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిధుల మంజూరుపై ఉమ్మడి జిల్లా ప్రజలు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– సూర్యాపేట, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రోడ్లకు మహర్దశ చేకూరింది. జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాలకు 579.58 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఇప్పటికే జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కోట్లాది రూపాయలు తీసుకువస్తుండగా వాటితో కొత్త రోడ్లు నిర్మిస్తున్నారు. దానికితోడు అవసరం ఉన్న ప్రతి చోటా మరమ్మతులు కూడా చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రోడ్లకు కొత్త సొబగులు రానున్నాయి.
ఎనిమిదిన్నరేండ్లలో ఎంతో మార్పు
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో రహదారులు అధ్వాన్నంగా ఉండేవి. కొత్త రోడ్లు వేయకపోగా పాత వాటికి మరమ్మతులు చేయకపోవడంతో గుంతల మయంగా కనిపించేవి. గ్రామాలతో పాటు పట్టణ రహదారుల పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఇక వర్షాకాలం వస్తే నీళ్లు నిలిచి గుంతలు కనిపించకపోవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడేవారు.
తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మెరుగు పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేల కోట్లు వెచ్చించి గ్రామాల్లోని అంతర్గత రోడ్లతో పాటు గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లు నిర్మించారు. దాంతో పల్లె నుంచి పట్నం దాకా రవాణా సౌకర్యం మెరుగు పడింది. ప్రజల కష్టాలు తీరాయి. ఇంకా రోడ్లకు నోచని గ్రామాలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూనే ఉంది.
గిరిజన తండాలు, ఆవాసాలకు 71.65 కోట్లు
తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇంకా రహదారులు లేని గిరిజన తండాలు, ఆవాసాలకు కొత్త రోడ్ల నిర్మాణం కోసం ట్రైబల్ వెల్ఫేర్ శాఖ నుంచి ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులు రూ.71.65 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులను గిరిజన ప్రాంతాల్లోని రోడ్లకు మాత్రమే వినియోగిస్తారు. సూర్యాపేట నియోకవర్గానికి రూ.7 కోట్లు మంజూరు కాగా తుంగతుర్తికి రూ. 8.74 కోట్లు, కోదాడ రూ.1.89 కోట్లు, హుజూర్నగర్ నియోకవర్గానికి రూ.4.99 కోట్లు విడుదలయ్యాయి. అలాగే ఆలేరుకు రూ.5.56 కోట్లు, భువనగిరి రూ. 0.21కోట్లు, దేవరకొండ రూ.29.53 కోట్లు, మునుగోడు రూ.4.21కోట్లు, నాగార్జునసాగర్ రూ.1.16 కోట్లు, మిర్యాలగూడ నియోజకవర్గానికి రూ. 8.36 కోట్లు విడుదలయ్యాయి.
ఈ మేరకు జీఓ విడదల కాగా త్వరలోనే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తారు. మూడు నలుగు నెలల్లోనే రోడ్డు పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కొత్త లేయర్లు, మరమ్మతులకు నిధులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో వేసిన రోడ్ల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.507.69 కోట్లు విడుదల చేసింది. వీటిలో ఆర్అండ్బీ శాఖ నుంచి రూ. 370.58 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నుంచి 137.11 కోట్లు విడుదల చేశారు. ఆర్ అండ్ బీ శాఖ ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని పది నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన 183 పనులను గుర్తించింది. వీటిలో 106 రహదారులపై సింగిల్ లేయర్ థార్ వేయనుండగా 77 రహదారులకు మరమ్మతులు చేపడుతారు.
సూర్యాపేట జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాలకు 50 పనులకు రూ.121.14 కోట్లు వెచ్చించనుండగా నల్లగొండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 71 పనులను గుర్తించగా వాటికి 170.66 కోట్లు ఖర్చు చేస్తారు. యాదాద్రిభువనగిరి జిల్లా పరిధిలో 52 పనులను రూ.78.77 కోట్లతో చేపట్టనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 399 కిలోమీటర్లకు రూ.137.11 కోట్లు మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల పరిధిలోని 12 నియోజకవర్గాల్లో 78 బీటీ రోడ్లను గుర్తించగా వాటికి మరమ్మతులు చేస్తూనే ఒక లేయర్ థార్ వేయనున్నారు.