మోటకొండూర్/ యాదగిరిగుట్ట, ఏప్రిల్ 29 : యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలోని 18 ఏ-బ్లాక్ భవనంలో మంగళవారం శ్రీహరికోటలో రాకెట్ లాంచ్‌లో ఉపయోగించే ప్రొఫలెంట్ తయా రు చేస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంతో భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో అందులో తొమ్మిది మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన కల్వల నరేశ్ (30)కు తీవ్రగాయాలు కాగా..
దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందాడు. మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన దేవిచరణ్(20), కాటేపల్లికి చెందిన గునుకుంట్ల సందీప్ (30) భవనం శిథిలాల కింద గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా తెలియలేదు. వలిగొండ మండలం పుల్లిగిల్లకు చెందిన బుగ్గ లింగస్వామి, మోటకొండూర్ మండలం చాడ గ్రామానికి చెందిన శ్రీకాంత్, యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన శ్రీకాంత్, పెద్దకందుకూరుకు చెందిన మహేందర్‌తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయ్యాలయ్యాయి. వారిని భువనగిరి ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. భవనం శిథిలాల కింద గల్లంతైన ఇద్దరి కోసం కంపెనీలో పని చేసే సిబ్బంది గాలిస్తున్నారు. పేలుడుతో వచ్చిన శబ్దంతో దాదాపు ఏడు కిలోమీటర్ల మేర భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
బాధిత కుటుంబాల ఆందోళన
కాటేపల్లి ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాల సభ్యులు, గ్రామస్తులు కంపెనీ ఎదుట, భువనగిరి – మోత్కురు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పి ఆందోళన
విరమింపజేశారు.
ఈ ఏడాదిలో జనవరిలో ఒకసారి పేలుడు..
ఈ ఏడాది ప్రారంభంలో ఇదే పీఈఎల్కు చెందిన యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూర్‌లో గల కంపెనీలో భారీ పేలుడు జరిగింది. జనవరి 3న పీఈఎల్ కంపెనీలో ఫెర్రోడివైజ్ ఫిల్లింగ్ అండ్ ప్రాసెస్సింగ్ భవనంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు ఎగుమతి చేసే ఫెల్లెట్ పార్ములా(ఐఆర్ఫ్లెర్స్) ప్రెస్సింగ్ చేస్తున్న సమయంలో గ్యాస్ ఎనర్జీ రావడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడే విధుల్లో ఉన్న జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన కార్మికుడు మార్క కనకయ్య(54) మృతి చెందారు. మరో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.