నకిరేకల్, అక్టోబర్ 31 : నకిరేకల్ వ్యవసాయ మార్కెట్కు రూ.43,20,000 విలువైన 1600 టార్పాలిన్లను ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ టార్పాలిన్లను నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. నకిరేకల్ మండలంలో మొత్తం 14 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా ఒక్కో కేంద్రానికి 30 చొప్పున 420 టార్పాలిన్లు అందించామని, కేతేపల్లి మండలంలో మొత్తం 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా, ఒక్కో కేంద్రానికి 30 చొప్పున 390 టార్పాలిన్లు అందించామని, కట్టంగూర్ మండలంలో మొత్తం 17 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా ఒక్కో కేంద్రానికి 30 చొప్పున 510 టార్పాలిన్లు ఉన్నాయి. ఈ మూడు మండలాలకు 1380 టార్పాలిన్లు పంపిణీ చేసినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు చెబుతున్నారు. అయితే నకిరేకల్ మండలంలోని తాటికల్లు-20, వల్లభాపురం-8, టేకులగూడెం(సన్న)-20, టేకులగూడెం(దొడ్డు)-20, ఓగోడు-20, కడపర్తి-15, చందంపల్లి-15, చీమలగడ్డ(సన్న)-20, చీమలగడ్డ(దొడ్డు)-20, చందుపట్ల-20, మంగళపల్లి-10, గోరెంకలపల్లి-30, నెల్లిబండ-16, నోముల-20 టార్పాలిన్లు పంపిణీ చేశారు.
అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 14 కేంద్రాలకు 420 టార్పాలిన్లు ఉండాలి. కానీ పంపిణీ చేసింది మాత్రం 254 మాత్రమే. మిగిలిన 166 టార్పాలిన్లు ఎక్కడికి పోయాయి? ఒక్కో టార్పాలిన్ ధర రూ.2700 అని అధికారులే చెబుతుండగా ఈ లెక్కన రూ.4,48,200 విలువజేసే 166 టార్పాలిన్లను ప్రైవేటుకు అమ్ముకొని సొమ్ముచేసుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇటు ధాన్యం కేంద్రాలకు పంపిణీ చేయకుండా, అటు మార్కెట్లో నిల్వలేక 166 టార్పాలిన్లు ఏమైనట్లని రైతులు ప్రశ్నిస్తున్నారు. అకాల వర్షాలు, తుపాన్ల ప్రభావంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. రోజుకు ఒక్కో పట్టాకు రూ.20 చొప్పున అద్దె చెల్లించి ధాన్యం కప్పుతున్నారు. మార్కెట్ కమిటీలో అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉన్నా వాటిని రైతులకు పంపిణీ చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి పక్కదారి పట్టిన టార్పాలిన్లను రైతులకు పంపిణీ చేస్తారా? కేతేపల్లి, కట్టంగూర్ మండలాల్లో పక్కదారి పట్టిన టార్పాలిన్లను రికవరీ చేసి రైతులకు చేరవేస్తారా? లేదా? వేచి చూడాల్సిందే!
రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు అన్నదాతల నోటి కాడి కూడు లాక్కుంటున్నారు. తుపాన్లతో ధాన్యం తడిసి రైతులు అరిగోస పడుతున్నా.. మార్కెటింగ్ శాఖ అధికారులు రైతులకు సరిపడా టార్పాలిన్లు ఇవ్వకుండా వాటిని పక్కదారి పట్టించి డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు మొంథా తుపాన్, మరో వైపు తడిసి మొలకెత్తుతున్న ధాన్యం, ఇంకో వైపు చిరిగిన టార్పాలిన్లతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో రూ.లక్షలు విలువ చేసే టార్పాలిన్లు పక్కదారి పడుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ పరిధిలో నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి మండలాలు ఉండగా ఒక్క నకిరేకల్ మండలంలోనే రూ.4,48,200 విలువైన టార్పాలిన్లు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ లెక్కన కట్టంగూర్, కేతేపల్లి మండల్లాలో ఎంత విలువైన టార్పాలిన్లు పక్కదారి పట్టాయో అధికారులే చెప్పాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్లక్ష్యంపై జిల్లా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని నకిరేకల్-16, కేతేపల్లి-17, కట్టంగూర్-16 మొత్తం 46 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 30 చొప్పున ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.37,26,00 విలువైన 1380 టార్పాలిన్లు పంపిణీ చేశాం. నిబంధనల ప్రకారం పెద్ద సెంటర్కు 50, చిన్న సెంటర్కు 30 చొప్పున పంపిణీ చేస్తున్నాం. ఇంకా 280 టార్పాలిన్లు మార్కెట్లో నిల్వ ఉన్నాయి. లిఖిత పూర్వకంగా సెంటర్ ఇన్ఛార్జిలు కోరితే అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.