– సామాజిక ప్రజా సంఘాల నేతలు
రామగిరి, డిసెంబర్ 25 : ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారత దేశంలో సామాజిక అసమానతలను సృష్టించి, వివక్షతలకు కారణమైనది మనుధర్మ శాస్త్రమేనని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, టిపివైఎస్ జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షం అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. భారతదేశంలో మెజార్టీ ప్రజలకు సహజ సిద్ధమైన ప్రకృతి వనరులను దూరం చేయడానికి, దుర్మార్గమైన కర్మ సిద్దాంతాన్ని నమ్మించడానికి ప్రపంచంలో మరెక్కడలేని విధంగా ఈ దుర్మార్గపు సిద్ధాంతం మన దేశంలో బ్రాహ్మణీయ మనువాద శక్తులు అమలు చేస్తున్నాయన్నారు. దాని దుష్ఫలితాలు నేటికి అనేక అసమానతలకు మూలాలుగా కొనసాగుతున్నాయన్నారు. కాల క్రమంలో రూపాల్లో తేడా ఉండవచ్చు కాని సారంలో తేడా లేదా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడటానికి, దోపిడి వ్యవస్థ రక్షణకై పుట్టిందే మనువాదం అన్నారు.
తెలంగాణ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు మాట్లాడుతూ.. మళ్లీ మనుధర్మాన్ని ప్రతిష్ఠించాలని మనువాద పాలకులు చూస్తున్నారని, మనకెందుకీ అంబేద్కర్ రాజ్యాంగం.. మనకున్నది మనుధర్మం అని అన్న అనంతకుమార్ హెగ్డే (బిజెపి ప్రముఖ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి) వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. రాజ్యాంగం అమలు ద్వారా అట్టడుగు సామాజిక వర్గాలు కొన్ని ప్రయోజనాలు పొందాయని, ఈమాత్రం వెసులుబాటును కూడా అగ్రకుల సంపన్న వర్గాలు బిజెపి, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తులు భరించలేక పోతున్నాయన్నారు. మన ధర్మం అంటే మనుధర్మమే అనడమంటే ఇంతకంటే అనాగరికమైన చర్య మరొకటి ఉండదన్నారు.
తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం (టిపివైఎస్) జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షం మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రద్దు చేయడానికి శత విధాల ప్రయత్నిస్తుందని టిపివైఎస్ జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షం అన్నారు. రాజ్యాంగానికి మౌలిక పునాదులుగా ఉన్న ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం వంటి వాటిని పెకిలింపచూస్తుందని దుయ్యబట్టారు. దీనివల్ల దేశం ఏమి సాధిస్తుంది.. మత వైషమ్యాలు పెరగడం, కుల ఘర్షణలు పెరగడం తప్పా సాటి మనిషిని పశువు కంటే నీచంగా చూడడం మినహా మరేమీ సాధించలేం అన్నారు. కాబట్టి బహుజన లోకమంతా జాగ్రత్తగా నిలబడాలన్నారు. మనుస్మృతిని మట్టిలో పాతరేసి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరి సాగర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గోలి సైదులు, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, మాలల ఐక్యవేదిక జిల్లా నాయకుడు అద్దంకి రవీందర్, మాల మహానాడు జాతీయ కార్యదర్శి తెలగమల యాదగిరి, కెవిపిఎస్ పట్టణ కార్యదర్శి గాదే నరసింహ్మ, కెవిపిఎస్ మండల కార్యదర్శి బొల్లు రవీందర్, సిఐటియు పట్టణ కన్వీనర్ ఔట రవీందర్, సిఐటియు జిల్లా నాయకులు సత్తయ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్, కెవిపిఎస్ పట్టణ నాయకులు కోటా సైదులు, నలుప రాజు, సైదులు, మురళి, సిహెచ్ తిరుపతయ్య, గోలి మల్లేశ్, యూత్ లీడర్ జయచందన్, పెరికే నరసింహ, రామలింగయ్య, సైదులు పాల్గొన్నారు.