నీలగిరి, జులై 04 : నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికను అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం 22 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే రూ.35 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2014లో వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహేశ్ అనే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతి చేసి మోసం చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారం, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి.
విచారణలో వ్యక్తి దోషిగా తేలడంతో జడ్జి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదేవిధంగా బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని డీఎల్ఎస్ఏను ఆదేశించారు. ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసి శిక్ష పడేలా చేసిన అప్పటి విచారణ అధికారి ఎస్ఐ వీరరాఘవులు, సీఐ ప్రకాశ్, సిబ్బంది మహేశ్, నరసింహారెడ్డి, రవీందర్, మిర్యాలగూడ ప్రస్తుత సీఐ పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పీపీ వేముల రంజిత్ కుమార్, సీడీఓ యూనస్, భరోసా లీగల్ ఆఫీసర్ కల్పన, లైజన్ అధికారులు నరేందర్, మల్లికార్జున్‌కు ఎస్పీ అభినందనలు తెలిపారు.