ఆత్మకూర్.ఎస్, డిసెంబర్ 10 : ఎనిమిది నెలల క్రితం కుక్క కరవగా ఇంజక్షన్ అందుబాటులో లేకపోవడంతో వేయించుకోకపోవడంతో ఆ వ్యక్తి బుధవారం మృతి చెందాడు. ఈ సంఘటన ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని బొప్పారం గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొప్పారం గ్రామ పంచాయతీకి చెందిన పరాల సతీశ్ (34) ను 8 నెలల క్రితం కుక్క కరిచింది. చికిత్స కోసం ఆత్మకూర్.ఎస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా అక్కడ స్టాక్ లేకపోవడంతో ఇంజక్షన్ తీసుకోలేదు. కాగా సతీశ్ ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగా రేబిస్ లక్షణాలు బహిర్గతమయ్యాయి. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మధ్యాహ్నం కన్నుమూశాడు. సతీశ్‌కు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.