యాదగిరిగుట్ట, సెప్టెంబర్25 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత మూడేండ్ల కాలంలో రాష్ట్రంలో 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించే విధంగా చర్యలు తీసుకున్నారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ ఆ స్థాయిలో రెట్టింపు పంటలు పండించి చూపిస్తే పాలాభిషేకం చేస్తామని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సవాల్ విసిరారు. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామిని బుధవారం ఆయన కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు వారికి స్వామివారి ప్రసాదం అందజేశారు.
అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశానికే అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ రాష్ర్టాన్ని మాజీ సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని, ప్రపంచమే గర్వపడే విధంగా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా ఇవ్వకుండా దాటవేసే ధోరణిలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపుల పార్టీగా అభివర్ణించారు. రేవంత్‌రెడ్డిది ఒక గ్రూపు, భట్టి విక్రమార్క ది మరో గ్రూప్, ఒక్కో మంత్రిది ఒక గ్రూపుగా మారి రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ అంటే ఒకటే నని, ఒకటే కేసీఆర్, ఒకటే పరిపాలన అని తెలిపారు. పదేండ్ల కాలంలో రాష్ర్టాన్ని మాజీ సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ చక్కటి పరిపాలన చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హితవు పలికారు. అభివృద్ధిని పక్కనబెట్టి కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టే పనిలో పడ్డారని విమర్శించారు. ప్రజలకు తప్పుదోవ పట్టించేందుకే హైడ్రాను తీసుకొచ్చారన్నారు. పేద ప్రజలపైనే హైడ్రా ప్రయోగాన్ని సంధించి వారిని తీవ్ర ఇబ్బంది పెట్టే పనిలో ఉన్నారని మండిపడ్డారు. తమ సంస్థలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే స్వచ్ఛందంగా తొలగిస్తామని వెల్లడించారు. రేవంత్‌రెడ్డి పాలనను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.