వానకాలంలో వాకింగ్ లేదనే బాధ వద్దు
ఇంట్లోనే వ్యాయామం చేయడం మరవద్దు
సికింద్రాబాద్, జూలై 5 : ఒకరోజు వ్యాయామం చేయకపోతే చాలా మంది ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు. కరోనా పరిస్థితుల తరువాత ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఆరోగ్యంపై అందరికీ చైతన్యం వచ్చింది. ప్రస్తుతం వర్షంతో పాటు చల్లటి వాతావరణం కాస్త ఇబ్బంది పెడుతున్నది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేందుకు బద్ధకించే పరిస్థితి. అలాగని వ్యాయామాన్ని మానేస్తే కలిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలోనూ ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి వద్ద నుంచే వ్యాయామాన్ని చేసుకొనే చిట్కాలను అవలంబించాలని చెబుతున్నారు. ఇందుకు ఇంటినే జిమ్‌గా మలచుకోవాలని సూచిస్తున్నారు.
ఆరోగ్యానికి మెట్లు
నగరవాసులలో అపార్ట్మెంట్లు, ఒకటి రెండు అంతస్తుల ఇండ్లల్లో ఉంటున్నారు. లిఫ్ట్‌లు వచ్చిన తర్వాత మెట్లు ఎక్కడం మరిచిపోయారు. మెట్లను ఆశ్రయిస్తే అదే ఆరోగ్యానికి పైమెట్టు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. రెండు మూడు మెట్లను ఒకే సారి ఎక్కకుండా ఒక్కొక్కటిగా మెల్లిగా ఎక్కాలి. ఇది ట్రీట్మెంట్ కన్నా ఉత్తమమని వ్యాయామ నివుణులు చెబుతున్నారు. దీని వల్ల నిమిషానికి 5 కేలరీలు ఖర్చవుతాయి.
స్కిప్పింగ్‌తో గుండె పదిలం
ఇంట్లోనే స్కిప్పింగ్.. సైక్లింగ్ చేయొచ్చు. స్కిప్పింగ్ చేయడం వల్ల గుండె పదిలంగా ఉంటుంది. బరువు తగ్గొచ్చు. శరీర దారుఢ్యాన్ని పెంచుకోవచ్చు. డంబెల్స్తోనూ కొద్ది సేపు కసరత్తు చేయవచ్చు. ఇప్పుడు ఇళ్లల్లో కొద్దిపాటి స్థలంలోనే ఇమిడే సైకిళ్లు వచ్చాయి. సైక్లింగ్ వల్ల చెమటలు పట్టేస్తాయి. గుండె పదిలానికి దారులు ఏర్పడతాయి.15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే 300 కేలరీలు ఖర్చవుతాయి.
శ్వాసపై ధ్యాస
వర్షాకాలంలో శ్వాసపై ధ్యాస ఉండే ధ్యానం, యోగా తదితర వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గాలిని పీల్చేటప్పుడు వదిలేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. పవర్ యోగా, ప్రాణాయామం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.