– పక్కా ప్లాన్‌తో మర్డర్
– పోలీస్ విచారణలో వెలుగు చూసిన నిజాలు
– అదుపులో ప్రధాన నిందితుడు శిరీష్ కుమార్
మిర్యాలగూడ, జూన్ 20 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని కలాల్‌వాడలో ఈ నెల 5న జరిగిన ముగ్గురు సజీవ దహనం కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. షార్ట్‌సర్క్యూట్‌తో సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం జరిగిందని తొలుత భావించిన పోలీసులు దర్యాప్తులో కొత్త మలుపు తిరిగింది. పక్కా ప్లాన్‌తోనే మర్డర్ జరిగిందని పోలీసుల విచారణలో నిజాలు తెలిసినట్లు సమాచారం. ఈ మేరకు ప్రధాన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసుపై నేడో రేపో పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కాగా ఈ నెల 5న కలాల్ వాడలో సిలిండర్ పేలుడు సంఘటనలో అమ్మమ్మ వనం చంద్రకళ, మనుమడు లక్ష్మణ్, మనుమరాలు ప్రణీత సజీవ దహనమయ్యారు. ఈ కేసును ఘటన వద్ద దొరకిన ఆధారాలు, కుటుంబ బందువుల నేపధ్యం పరిశీలించగా పక్కా ప్లాన్‌తో హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. చంద్రకళ కూతురు ధనమ్మ భర్త గతంలో చనిపోగా శిరీశ్కుమార్తో రెండవ వివాహం చేసుకుంది. అతడితో కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాల కారణంగా అతడిని వదిలేసి ధనమ్మ పూణెలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది.
చంద్రకళ, లక్ష్మణ్, ప్రణీతను హతమారిస్తే తనకు అడ్డు ఉండదని భావించిన శిరీశ్‌కుమార్ పక్కా ప్లాన్‌తో హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. గత నెల రోజులుగా అతడి కదలికలు, ఫోన్ కాల్ డేటా, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 5న చంద్రకళ, లక్ష్మణ్, ప్రణీత నిద్రిస్తున్న సమయంలో ధనమ్మ రెండవ భర్త శిరీష కుమార్ ఇంట్లోకి వెళ్లి గ్యాస్ లీక్ చేసి మంటపెట్టి బయటి నుండి గడియపెట్టి పారిపోయినట్లు, దీంతో వారు బయటకు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో సజీవ దహనం అయినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం శిరీషకుమార్ను అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసు వివరాలను త్వరలోనే పోలీసులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.