నీలగిరి, జూన్ 25. జిల్లా కేంద్రంలోని ప్రకా శం బజార్లో సాయిరాం మెడికల్ ఏజెన్సీ గోదాంలో బుధవారం ఉదయం షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఏజెన్సీ తీసిన వెంటనే ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇం జన్లు అక్కడకు వచ్చాయి. కానీ ట్యాంకర్లలో నీరు లేకుండానే రావడంతో సుమారు గం ట కుపైగా వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో అగ్నిమాపక అధికారుల నిర్లక్ష్యంతో భారీ ప్రమా దం జరిగి సుమారు కోటిన్నరకుపైగా మం దులు దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
మంటలు పెద్దఎత్తున ఎగిసిపడడంతో దట్టమైన పొగ అలుముకుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతోపాటు చుట్టపక్కల బ్యాంకులు దవాఖానలు, నివాస భవనాలు ఉండడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీసులు అక్కడి చేరుకున్నారు. ఫైర్ఇంజన్లలో నీరు లేకపోవడంతో మున్సిపల్ అధికారుల సహకారంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
సుమారు మూడు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పారు. ఫైరింజన్లు వచ్చిన సమయంలో నీరు ఉండి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని ప్రజలు చర్చించుకున్నారు. గత అనుభవాలు ఉన్నప్పటికీ కూడా నీరు సిద్ధంగా ఉంచుకోకపోవడం అగ్నిమాపక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనబడింది. మెడికల్ గోదాంలో కోటిన్నరకుపైగా మెడిసిన్స్ ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆస్తినష్టం తప్ప ప్రాణనష్టం జరగలేదని, అన్ని శాఖల సహకారంతో మంటలను అదుపులోకి తెచ్చామని అధికారులు తెలిపారు.