రామగిరి, ఆగస్టు 24 : నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు.. అనే చందంగా ఉంది.. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారుల పనితీరు. ఎంజీయూలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారుల వివరాలు, ఆయా విభాగాల్లో అమలు చేసే అంశాలను ఎప్పటి కప్పడు వర్సిటీ వెబ్‌సైట్‌ల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఎంజీయూ డైరెక్టర్ ఆఫ్ ఆడిట్ సెల్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా డాక్టర్ జె. సురేష్‌రెడ్డి పనిచేస్తుండగా ఆయన స్థానంలో గత ఫిబ్రవరి 3న యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.జయంతిని నియమిస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. అల్వాల రవి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఆమె ఆ హోదాలో పనిచేస్తున్నారు.
అయితే నేటికీ ఎంజీయూ ప్రధాన వెబ్సైట్లో మాత్రం ఇంకా పాతవారి ఫొటోలు, వారి సమాచారమే ఉండటంతో వర్సిటీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అదే విధంగా యూనివర్సిటీ అధికారుల సమాచారం లాగిన్‌లో ఓఎస్డీ హోదా లేనప్పటికీ ప్రొ. కొప్పుల అంజిరెడ్డి పేరు తొలగించలేదు. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మారి వేరే వారికి బాధ్యతలు అప్పగించినా పాతవారే కనిపిస్తున్నారు.
యూనివర్సిటీలో సైకాలజీ కోర్సు కొనసాగిస్తున్న ప్రధాన వెబ్సైట్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ విభాగంలోని కోర్సులు ప్రొగ్రామ్స్‌లో కనిపించడంలేదని, మరో వైపు ప్రస్తుతం వివిధ కోర్సులకు అడ్మిషన్లు చేపడుతుండగా ఎంజీయూ వెబ్సైట్లో ఆ వివరాలు లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా వేత్తలు, అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అప్డేటెడ్ సమాచారాన్ని వెబ్సైట్లో ఉండేలా చూస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈనెల 24వ తేదీ వరకు వెబ్‌సైట్‌ను అప్డేట్ చేయకపోవడం గమనార్హం.