
ఆత్మకూరు(ఎం), డిసెంబర్ 6 : వరి కన్నా ఇతర పంటల సాగే మేలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుండడంతో ఆ దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన రైతు జిల్లాల మల్లారెడ్డి ముందుచూపుతో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నాడు. పదేండ్లుగా తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి ఇచ్చే వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. ఏడేండ్ల క్రితం దానిమ్మ, సపోట, జామ, నిమ్మ తోటలతో లాభాలు ఆర్జించగా మూడేండ్ల నుంచి శ్రీగంధం మొక్కలు పెంచుతున్నాడు.
11 ఎకరాల్లో శ్రీగంధం సాగు
జిల్లాల మల్లారెడ్డికి గ్రామంలో 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో దానిమ్మ, సపోట, జామ, నిమ్మ తోట వేశాడు. కాత ద్వారా మంచి ఆదాయాన్ని పొందాడు. మూడేండ్ల క్రితం వాటిని తొలగించి 11 ఎకరాల్లో శ్రీగంధం మొక్కల పెంపకం చేపట్టాడు. వాటి మధ్యలో ఎర్రచందనం, జామ, సీతాఫలం మొక్కలను నాటి సాగు చేస్తున్నాడు
ఇతర పంటలు కూడా..
శ్రీగంధం సాగుతోపాటు మూడెకరాల్లో మామిడి, రెండెకరాల్లో కంది, ఎకరంలో వేరుశనగ సాగు చేస్తున్నాడు. 20 గుంటల స్థలంలో ఫాంపాండ్ ఏర్పాటు చేసి చేపలు కూడా పెంచుతున్నాడు.
శ్రీగంధం చెట్లకు డిమాండ్
శ్రీగంధం, ఎర్రచందనం చెట్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. ఒక్కో చెట్టుకు సుమారు రూ.లక్ష ఆదాయం వస్తుంది. చెట్టు నాటిన 18 నుంచి 20 సంవత్సరాల్లో అమ్ముకోవచ్చు. వీటి మధ్యలో అరటి సాగు కూడా వేసుకోవచ్చు. రైతులు వరికి బదులు ఇతర పంటలు వేస్తే లాభాలు పొందుతారు.
-మురళి ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ క్లస్టర్ అధికారి
ఉద్యాన సాగు బాగుంది..
ఉద్యాన పంటలతో మంచి లాభాలు వస్తున్నాయి. 11 ఎకరాల్లో 3500 శ్రీ గంధం మొక్కలు, 500 జామ, 2000 సీతాఫలం, 500 ఎర్రచందనం, 500 మామిడి మొక్కలు నాటిన. మిశ్రమ పంటగా నువ్వులు, మినుములు, వంకాయ, మిర్చి పంట వేసిన. శ్రమ ఉన్నా లాభాలు మంచిగా ఉంటాయి.
-జిల్లాల మల్లారెడ్డి, రైతు, రాయిపల్లి