గుర్రంపోడు, ఆగస్టు 26 : గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన వంగూరి సాయితేజ గత నెల మొదటి వారంలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను గుర్రంపోడు పోలీసులు చాకచక్యంగా వెతికి పట్టుకున్నారు. దేవరకొండలో లభ్యమైన ఈ ఫోన్ను గుర్రంపోడు ఎస్ఐ వెంకన్న బుధవారం పోలీస్ స్టేషన్లో బాధితుడికి అందజేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వంగూరి సాయితేజ గత నెలలో మొబైల్ ఫోన్ ను పోగొట్టుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకన్న పర్యవేక్షణలో పోలీసులు కేసు నమోదు చేశారు. మొబైల్ ట్రాకింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ ఫోన్ ఎక్కడ ఉందో నిరంతరం పర్యవేక్షించారు. ఈ క్రమంలో సదరు మొబైల్ దేవరకొండలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించి, పోలీసులు అక్కడకు వెళ్లి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పోయిన తన ఫోన్ను అతి తక్కువ కాలంలోనే వెతికి పట్టుకుని స్వయంగా అందజేసినందుకు బాధితుడు సాయితేజ ఎస్ఐ వెంకన్నకు, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఫోన్ పోగొట్టుకున్న వారు అధైర్య పడకుండా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.