రామగిరి, నవంబర్ 24 : నల్లగొండ అంటేనే చారిత్రాత్మక ప్రదేశంగా చెప్తుంటారు. ఇక్కడ ఎన్నో విశిష్టమైన ఆలయాలు ఉన్నాయి. పాతబస్తీలోని షేర్బంగ్లా సమీపంలో ఆర్యసమాజం(శిశుమందిర్) ఎదురుగా ఇండ్ల మధ్యలో అద్భుతమైన పురాతన శివాలయం ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా శివుడి పానవట్టం వద్ద హనుమాన్ విగ్రహం ఉండటం ఇక్కడి విశిష్టతగా చెప్పవచ్చు. దీనిని హనుమాన్ సమేత ఉమా మహేశ్వరస్వామి దేవస్థానంగా పిలుస్తుంటారు. ఆలయంలో పెద్ద సాలగ్రామం ఉంది. ఆలయం వెలుపల అమ్మవారి విగ్రహం ఉంటుంది. కార్తిక మాసం కావడంతో నిత్యం ప్రత్యేక పూజలు సాగుతున్నాయి. నేడు కార్తిక చివరి సోమవారం సందర్భంగా పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ప్రజ లు, భక్తులు తమకు తోచినంత నిధులు సమకూర్చి దేవస్థానం నిర్వహణ చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ఇక్కడ పూజలు చేస్తే అనుకున్నది నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.
నల్లగొండ పాతబస్తీలో ఓవైపు కాపురాలగుట్ట మరోవైపు బ్రహ్మంగారి గుట్ట ఉన్నాయి. షేర్బంగ్లా సమీపంలో కందూరు చోడులు, కాకతీయ సామంత రాజుల కాలంలో నిర్మించిన ఆలయం హనుమాన్ సమేత ఉమా మహేశ్వరస్వామి దేవస్థానం. అప్పటి సామంత రాజులు ఆలయంలో పూజలు చేశారని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఈ శివాలయంలో చాలా కాలం ఘనమైన పూజలు జరిగాయని, మధ్యలో కొంత కాలం శిథిలావస్థకు చేరుకొని మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చిందని అంటున్నారు. ఇండ్ల మధ్యలో ఉండడం వల్ల ఈ ఆలయం బయటికి అంతగా కనిపించడం లేదు.ఆలయ ప్రాంగణంలో పెద్దబావి ఉండేది దానిని నుంచి ఆ ప్రాంతం వారు మంచినీటిని తీసుకెళ్లే వారని స్థానికులు చెబుతున్నారు. స్థల ప్రభావంతో దానిని పూడ్చివేశారు.
హనుమాన్ సమేత ఉమా మహేశ్వర దేవాలయం అద్భుతమైనది. ఇక్కడ మూడు, ఐదు వారాలు పూజలు చేస్తే దీర్ఘకాలిక భక్తుల కోరికలు నెరవేరుతాయి. ఈ ప్రాంతవాసులు, భక్తుల సహకారంతో దేవస్థాంలో నిత్యపూజలు, పండుగలు చేస్తున్నాం. ఇలాంటి పురాతన ఆలయాలను వెలుగులోకి తెచ్చి నాటి చరిత్రను నేటి తరానికి అందించేలా పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది.
– పర్వతం శివకుమార్, ఆలయ అర్చకుడు, నల్లగొండ