అనుముల : అనుముల మండలం పేరూరు గ్రామంలో పురాతన శ్రీ భువనేశ్వరి సమేత స్వయంభు సోమేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. వేదమంత్రోచ్ఛరణలు, బాజాభజంత్రీల నడుమ స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండువలా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పేరూరు గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.
స్వామివారి కళ్యాణం అనంతరం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెక్కల కొండారెడ్డి, ఈవో వెంకటరమణ, దేవాలయ కమిటీ ధర్మకర్తలతోపాటు ఆలయ అర్చకులు రాకేష్ శర్మ, మోహన్ శర్మ, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.