నల్లగొండ ప్రతినిధి, మే 11 (నమస్తే తెలంగాణ) : లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకులు మూగబోయాయి. ప్రచార వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కండువాలు, జెండాలు పక్కనపడ్డాయి. ఇన్నాళ్లు రణగొణ ధ్వనులతో హోరెత్తిన వీధుల్లో నిశ్శబ్ధం ఆవరించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. దాంతో చివరి రోజు భువనగిరి, నల్లగొండ లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు రోడ్ షోలు, భారీ ర్యాలీలతో హల్చల్ చేశారు. ఇక ప్రచారం ముగియడంతో అభ్యర్థులంతా పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు.
ఇన్నాళ్లు చేసిన ప్రచార ఫలితం రాబట్టే దిశగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం రేపటి పోలింగ్‌పై దృష్టి సారించింది. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ పకడ్బందీ ఏర్పాట్లతో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. ఆదివారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూటరీ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రిని తీసుకుని సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. సోమవారం ఉదయం 7నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
ఎన్నికల ప్రచారంలో చివరి రోజు శనివారం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలంతా ఎక్కడికక్కడే ప్రచార ర్యాలీలతో హోరెత్తించారు. భువనగిరి, నకిరేకల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపు కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ రోడ్ షోలు నిర్వహించారు. అభ్యర్థితోపాటు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలతో సహా అన్నిచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోరుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ర్యాలీలు చేపట్టారు. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్‌కు మద్దతుగా నిలువాలని కోరారు.
దాంతో ప్రజలు కూడా గతానికి, ఇప్పటికి పరిస్థితులను అంచనా వేస్తూ గతంలో జరిగిన పొరపాటును పునరావృతం కాకుండా బీఆర్ఎస్కు ఓటు వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. సాగునీళ్లు ఇవ్వక, మంచినీళ్లు లేక, కరెంటు రాక పడుతున్న ఇబ్బందులతో రైతులంతా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్‌తో పాటు ఇతర ముఖ్య నేతల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించడం విశేషం. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థు లు, ఆ పార్టీ శ్రేణులు చివరి రోజు ర్యాలీ నిర్వహించారు. ప్రచారం ముగియడంతో అంద రూ ఇక అండర్ గ్రౌండ్ ఆపరేషన్లకు తెరలేపారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది.
సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ మొదలు కానుంది. ఇందుకోసం ఆదివారం పోలింగ్ సామగ్రితో సహా సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేయనున్నారు. సిబ్బంది ఇవ్వాళ ఉదయం ఏడు గంటల వరకే తమకు కేటాయించిన నియోజకవర్గాల్లోని డిస్ట్రిబ్యూటరీ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు. తర్వాత ఆయా రూట్ల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు.
సోమవారం ఉదయం ముందుగా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. నల్లగొండ లోక్‌సభ స్థానంలో 17,22,521 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందన ప్రకటించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నదని నల్లగొండ ఎస్పీ చందనాదీప్తి వెల్లడించారు.