నేరేడుచర్ల, జూన్ 16 : జడ్చర్ల – భద్రాచలం జాతీయ రహదారిపై ఆలగడప వద్ద ఏర్పాటు చేసిన టోట్గేట్ వద్ద 20 కిలోమీటర్ల పరిధిలోని వాహన యజమానులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ, మండల ప్రజలు ప్రతినిత్యం వైద్య చికిత్సలకు, ఇతర పనుల కోసం మిర్యాలగూడకు వెళ్లాల్సి వస్తుందని, ఆలగడప టోల్ గేట్ ఐదు కిలోమీటర్ల దూరం కూడా లేనందున టోల్ యాజమాన్యం సానుకూల ధోరణితో ఆలోచించి ప్రయాణికులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని రాస్తారోకోలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు.
మిర్యాలగూడ – కోదాడ రహదారిపై భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ స్తంభించడంతో నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ తన సిబ్బందితో రాస్తారోకో వద్దకు చేరుకుని నాయకులను బలవంతంగా లేపి చెదరగొట్టారు. రాస్తారోకోలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాల ధనుంజయ నాయుడు, బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాపోల్ నవీన్ చిలకరాజు శ్రీను ఏ.లక్ష్మి, జీలకర్ర రామస్వామి, కొమరాజు వెంకట్ అరుణ్ కుమార్, వడ్లమూడి ఉపేందర్, ఎడవల్లి నర్సిరెడ్డి, పోరెడ్డి బుచ్చిరెడ్డి, పరిక భరత్, పి.వివేక్, సంతోష్, చందమళ్ల నవీన్ కుమార్, హుస్సేన్ అక్బర్ పాల్గొన్నారు.