వేములపల్లి, జూన్ 22 : స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రుల ప్రకటనలతో ఆశావాహుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. గ్రామ పంచాయతీల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 1న ముగిసింది. ఇప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇతర పార్టీల నుంచి పలువురు జంపింగ్ జపాంగ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ జంపింగ్ జపాంగ్‌లు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతుంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీలో, 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ కొలువు తీరగానే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరే జంపింగ్ జపాంగ్‌లతో తలనొప్పిగా మారిందని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఆశావాహులు చర్చించుకుంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉండి పార్టీని బలోపేతం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చాక తాము బరిలో నిలబడితే పార్టీ మారిన వారితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆశావాహులు గుసగుసలాడుతున్నారు. ఇలాంటి తలనొప్పులు అధికంగా అధికార పార్టీలో ఉండడం గమనార్హం. వీరు ఆశావాహులకు కొరకరాని కొయ్యలా తయారవుతున్నారు. మరోవైపు ఎన్నికలు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ రావడంతో నిరాశ చెందారు. తాజా ప్రకటనలతో వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఎలాగైనా పోటీ చేసి గెలుపొందాలన్న ఆరాటంతో ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు.
యువతలో ఆసక్తి…
పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు, ఇతర పార్టీలోని గ్రామస్థాయి నేతలు ముఖ్యంగా యువకులు ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అయ్యారు. కొందరు ఇప్పటికే డబ్బులు కూడా సిద్ధం చేసుకున్నారు. మరికొందరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్న పార్టీలు..
ఈసారి మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో జరగబోయే స్థానిక ఎన్నికలను అధికార పార్టీతోపాటు ఇతర పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఈసారి గెలుపొందాలని పట్టుదలతో ఉన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఇతర పార్టీలు కూడా బలంగానే ఉన్నాయి. అధికార పార్టీ తమ వారిని గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డనున్నారు.