నేరేడుచర్ల/సూర్యాపేట అర్బన్, అక్టోబర్ 14 పశువులకు సోకే ప్రధాన వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. సకాలంలో వ్యాధి లక్షణాలను గురించి నివారణ చర్యలు చేపట్టకపోతే పశువులు, వాటి పాలు దాగిన దూడలు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో గాలికుంటు నివారణ టీకాల పంపిణీకి పశు సంవర్ధక శాఖ సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా 23 మండలాల్లో 1.86 లక్షల పశువులు ఉంటాయని అంచనా వేసి, 46 బృందాలను ఏర్పాటు చేంది. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు టీకాల పంపిణీ కొనసాగనున్నది. జిల్లాలోని 5 పశు వైద్యశాలలు, 41 ప్రాథమిక చికిత్స కేంద్రాలు, 42 గ్రామీణ పశువైద్యశాలతోపాటు అన్ని గ్రామాల్లో ఆవులు, ఎద్దులు, గేదెలకు టీకాలు వేయనున్నారు.
వ్యాధి వ్యాప్తి ఇలా..
గాలికుంటు వ్యాధి పికోర్నా విరిడే వైరస్ ద్వారా వస్తుంది. పశువులు కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వ్యాప్తి చెందుతుంది. పశువులు అలాంటి ఆహారం, నీరు తీసుకోకుండా పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.
గుర్తించడం ఇలా..
గాలి కుంటు సోకిన పశువుల ఉష్ణోగ్రత 104 డిగ్రీల నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. నోరు, నాలుక, పెదవులు, చిగుళ్లు, కాలి గిట్టల దగ్గర బొబ్బలు వస్తాయి. 24 గంటల తర్వాత అవి పగిలి పుండ్లుగా మారుతాయి. ఈ వ్యాధి సోకిన జీవాలు నోటిలో పుండ్ల నొప్పి కారణంగా మేత తినవు. దాంతో నీరసించిపోతాయి. నోటి నుంచి లాలాజలం కారుతుంటుంది. కాలి గిట్టల్లో ఉన్న పుండ్లు వల్ల సరిగ్గా నడవలేవు. వ్యాధి సోకిన తరువాత పాలు ఇవ్వడం తగ్గుతుంది. లేత వయస్సు గల పశువులకు వ్యాధి సోకితే మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొన్ని పశువుల్లో బొబ్బలు పొదుగుపైన ఏర్పడితే పొదుగు వాపునకు దారి తీస్తుంది.
చికిత్స..
పశువుల నోరు, కాలి గిట్టల మధ్య ఏర్పడిన పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావకంతో శుభ్రంగా కడుగాలి. తరువాత బోరోగ్లిజరిన్ పేస్ట్‌ను పుండ్లపై రాయాలి. పెన్సిలిన్ వంటి యాంటిబయోటిక్ మందులను పశువులకు అందించాలి. హోమియోలోనూ ఈ వ్యాధి నివారణకు మందులు ఉన్నాయి.
నివారణ చర్యలే ముఖ్యం
పశువుల్లో గాలి కుంటు వ్యాధి సోకిన తర్వాత జాగ్రత్తలు తీసుకునే కంటే ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్యం. నాలుగు నెలల వయస్సు నిండిన పశువులు, జీవాలకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలి. గేదెలు, ఆవులకు 2 మిల్లీలీటర్ల చొప్పన టీకా ఇవ్వాలి. ప్రతి ఆరు నెలలకోసారి క్రమం తప్పకుండా టీకాను వేయిస్తే గాలికుంటు వ్యాధి సోకదు. వ్యాధి సోకిన గేదె పాలను దూడలకు తాగించకూడదు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీనివాస్‌రావు, జిల్లా పశువైద్యాధికారి, సూర్యాపేట